గడువులోపే కంప్లీట్ కావాలి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం

by Gantepaka Srikanth |
గడువులోపే కంప్లీట్ కావాలి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్(Seetharama project) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పెండింగ్‌లో ఉన్న టెండర్ల ప్రక్రియను సత్వరమే కంప్లీట్ చేయాలని స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియలో అలసత్వం వద్దని, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. జలసౌధలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆ జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మలనాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన టెక్నికల్ అనుమతుల విషయాలలో అధికారులు కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వాల నుంచి అవసరమైన పరిపాలనాపరమైన (అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్) అనుమతులలోనూ వేగం పెంచాలన్నారు. నిర్ణీత గడువు లోపు నిర్మాణాలు పూర్తి కావాలని నొక్కిచెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు చెందిన పంప్‌హౌజ్‌లు ఆగస్టు 15న ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టన్నెల్, కాలువల నిర్మాణాల పనుల పురోగతిపై మంత్రులు రివ్యూ చేసి అధికారుల నుంచి లేటెస్ట్ స్టేటస్ వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖా సలహాదారు అదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈ-ఇన్-సీ లు అనిల్ కుమార్, నాగేందర్ రావు లతో పాటు సీతారామ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస రెడ్డి, ఖమ్మం జిల్లా సీఈ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story