Minister Uttam: ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వం

by Gantepaka Srikanth |
Minister Uttam: ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాల విషయమై ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని, రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల కేటాయింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ WP1230/2023పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మట్లాడుతూ.. కోర్టు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసిందని, ఈ నెల 25 తేదీ కల్లా అన్ని వాదనలపై షార్ట్ నోట్స్ సమర్పించాలన్నారని చెప్పారు.

ఈనెల 19-21 వరకు నిర్వహిస్తున్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ యథాతథంగా ఉంటుందని తెలిపారు. సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం వాదనలకు మద్దతుగా నిలిచిందని, రాష్ట్ర హక్కులను రక్షించడంలో ముందడుగు పడిందని స్పష్టం చేశారు. మంత్రితోపాటు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, న్యాయవాదులు వైద్యనాథన్, గోపాల్ శంకర్ నారాయణ, అంతర్రాష్ట్ర నీటి వనరుల విభాగం అధికారులు, ఈఎన్సీ, (O&M) తదితరులు హాజరయ్యారు.

Next Story

Most Viewed