ఏ టెన్త్ పేపర్ లీక్ కాలేదు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |
ఏ టెన్త్ పేపర్ లీక్ కాలేదు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీకైనట్లు వార్తలు వస్తున్నాయని, దీంతో విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతున్నదని, కానీ ఇప్పటివరకు ఏ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రమూ లీక్ కాలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తొలి రోజున తెలుగు, తాజాగా హిందీ ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

స్టూడెంట్స్, పేరెంట్స్ ఈ వార్తలను నమ్మి ఆందోళనకు గురికావద్దన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎలాంటి అవకతవకలు జరిగినా సిబ్బందిని శాశ్వతంగా విధుల్లోంచి తొలగిస్తామని, ఫస్ట్ స్టెప్‌లోనే వారిపై డిస్మిస్ వేటు వేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నొక్కిచెప్పారు.

పదో తరగతి పరీక్షల్లో మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి పుకార్లకు తావు లేకుండా పేరెంట్స్‌లో ఎలాంటి ఆందోళన లేకుండా పకడ్బందీగా జరిగేలా విద్యాశాఖ సిబ్బంది వ్యవహరించాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం జరిగితే బాధ్యులైనవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, స్వార్ధ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని సిబ్బందికి విజ్ఞప్తి చేశారు.

పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఆదేశించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టంచేశారు. జవాబు పత్రాల రవాణా విషయంలోనూ మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆమె ఆదేశించారు.

Advertisement

Next Story