ప్రగతి నివేదికలు సిద్ధం చేయండి: కలెక్టర్ అమోయ్ కుమార్

by Kalyani |
ప్రగతి నివేదికలు సిద్ధం చేయండి: కలెక్టర్ అమోయ్ కుమార్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతిపై ప్రగతి నివేదికలను రూపొందించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్ ఐదు నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై సమగ్రంగా నివేదికలు తయారు చేయాలని కోరారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్, ముఖ్య ప్రణాళిక అధికారి మోహన్ రావులతో కలిసి ప్రగతి నివేదికల తయారీపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2014-2015 వార్షిక సంవత్సరం నుంచి 2022-2023 సంవత్సరం వరకు నియోజకవర్గాల వారీగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పనులకు సంబంధిత శాఖల అధికారులు అభివృద్ధి పనుల ఫొటోలతో కూడిన నివేదికను రూపొందించాలన్నారు. అయితే మేడ్చల్ నియోజకవర్గం నివేదికను మాత్రం ఈ నెల 25వ తేదీలోగా సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.

మిగతా నాలుగు నియోజకవర్గ వర్గాలకు సంబంధించిన నివేదికలను ఈ నెల 30వ తేదీలోగా సమర్పించాలని కోరారు. జిల్లా అభివృద్ధి కోసం అధికారులు నిబద్దతతో పనిచేయాలని సమష్టి కృషితో జిల్లాను అన్ని రంగాలలో ముందుండే విధంగా కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నివేదికలను సీపీవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story