ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: కలెక్టర్ అమోయ్ కుమార్

by Kalyani |
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: కలెక్టర్ అమోయ్ కుమార్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఈ నెల 13వ తేదీన జరుగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే పై అధికారులకు సమస్యలు తెలియజేసి పరిష్కరించే విధంగా చొరవ చూపించాలని కోరారు.

వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 14 పోలింగ్ కేంద్రాల్లో ప్రతి కదలిక రికార్డ్ చేయబడుతుందని, ఏ ఒక్క అధికారి కూడా తప్పు జరగకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సిబ్బందిలో ఎవరైనా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇందుకు పౌరులు సహకరించాలని కోరారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూం చేరేవరకు పోలింగ్ అధికారులు బాధ్యత వహించాలని చెప్పారు.

ఈ నెల 12న బ్యాలెట్ బాక్స్ ల పంపిణీ..

ఎన్నికల నిర్వహణలో భాగంగా అవసరమైన బ్యాలెట్ బాక్స్ లను, బ్యాలెట్ పేపర్లను, ఇతర అవసరమైన సామాగ్రిని ఎన్నిక నిర్వహించే ముందు రోజు పోలింగ్ బూత్ అధికారులకు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఉన్న స్ట్రాంగ్ రూం వద్ద నుంచి నిర్వహణ సామాగ్రిని అందిస్తామని పేర్కొన్నారు. పోలింగ్ అధికారులు సామాగ్రిని ముందుగా పరిశీలించి బూత్ కు వెళ్లాలని సూచించారు.

Advertisement

Next Story