కబ్జా కోరల్లో సర్కార్ స్థలాలు !

by Sumithra |
కబ్జా కోరల్లో సర్కార్ స్థలాలు !
X

దిశ, దుండిగల్ : దుండిగల్ - గండి మైసమ్మ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో విలువైన ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి. కబ్జాల నుండి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం కబ్జాదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కత్బులాపూర్ నియోజకవర్గం దుండిగల్ - గండిమైసమ్మ మండలం దుండిగల్ తండా - 2 సర్వేనెంబర్ 684లో ప్రభుత్వ భూములను కబ్జాదారులకు అప్పనంగా కట్టబెట్టేందుకు సంబంధిత అధికారులు మొగ్గుచూపుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతుండడం, సులువుగా డబ్బు సంపాదించేందుకు కొందరు స్థానిక నాయకులు పథకం పన్నారు.

దుండిగల్ తండా-2 సర్వే నంబర్-684 లో బీఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో ప్రభుత్వ భూమిలో కమర్షియల్ షటర్లు, రూములు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేప్పటి పాత ఇంటి నంబర్లు వేసి అమాయకులకు కట్టబెడుతూ సొమ్ము చేసుకుంటున్నా దుండిగల్ రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. నెలనెలా లక్షల రూపాయలు జీతాలు అందుకుంటున్న రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు అమ్ముడు పోతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల వైఫల్యంతో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడంలేదు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా రెవెన్యూ అధికారులు సహకరించట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఉపేక్షించం.. సయ్యద్ అబ్దుల్ మతిన్, తహశీల్దార్

దుండిగల్ తండా - 2, సర్వే నంబర్ 684లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. గతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం. అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. దుండిగల్ తండా-2లో లా అండ్ ఆర్డర్ సమస్య ఉండడం వల్ల అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు కొంత ఆలస్యమవుతుంది. త్వరలో అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed