బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ పార్టీని తాకట్టు పెట్టారు : సీఎం రేవంత్ రెడ్డి

by Aamani |   ( Updated:2024-04-22 14:27:01.0  )
బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ పార్టీని తాకట్టు పెట్టారు :  సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ,మేడ్చల్ బ్యూరో : బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ పార్టీని మోడీ దగ్గర తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. తెలంగాణలో ఐదు బీజేపీ సీట్లు గెలిపించేందుకు కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను రంగంలోకి దింపారని ఆరోపించారు. సోమవారం సాయంత్రం శామీర్ పేట మండలంలోని అంతాయి పల్లిలో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికల ‘‘జన జాతర ’’సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసున్నారని, రాష్ట్రంలో 5 ఎంపి స్థానాల్లో బీజేపీని గెలిపిస్తానని మోడితో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ బలంగా ఉన్న చోట బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. ఇన్నాళ్లు తనను గుండెల్లో పెట్టుకున్న హుజారాబాద్ ప్రజలు ఇప్పుడు ఈటల రాజేందర్ ను ఎందుకు ఓడించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై జరుపాలని హోంమంత్రి అమిత్ షా ను ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. కేటీఆర్ అవినీతి, ఫోన్ల ట్యాపింగ్ గురించి రాజేందర్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. మోడీ ఇచ్చిన హామీల పై బహిరంగ చర్చకు సిద్దమా..? అని నీవు సిద్దమైతే.. మైనంపల్లిని పంపిస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్, మోదీ తోడు దొంగలేనని,బీఆర్ఎస్ కు ఓటేసిన బీజేపీకి వేసినట్టేనన్నారు.

కేసీఆర్ కుట్రలతో..

కేసీఆర్ కుట్రలతో కొడంగల్ లో ఓడిస్తే.. 2019 ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు తనను కడుపులో పెట్టుకొని ఎంపీగా గెలిపించి తనను ఢిల్లీకి పంపించారని గుర్తుచేశారు.రాజకీయాల్లో పడిపోతున్న తనకు కేసీఆర్ తో పొరాడెంత బలం ఇచ్చింది మల్కాజిగిరి ప్రజలు, కార్యకర్తలేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎంపీగా చేసిన పోరాటంతోనే తాను అధిష్టానాన్ని ఆకర్షించి పీసీసీ చీఫ్ , సీఎం అయ్యానని గుర్తుచేశారు.మల్కాజిగిరి నియోజకవర్గాన్ని నేనుప్పుడు మార్చిపోనన్నారు. బీఆర్ఎస్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా చేసిందని, ఇక్కడ అభివృద్ధి లేనందునే కోకాపేటలో ఎకరానికి రూ.100 కోట్లు పెరిగినట్లు ఇక్కడ భూముల రేట్లు పెరగలేదన్నారు.పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన ఇళ్ల లెన్ని అని సీఎం ప్రశ్నించారు. మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి ఢిల్లీకి పంపిచారని, ఆనాడు ఎన్నో సమస్యలపై పోరాటం చేసినట్లు గుర్తు చేశారు.

అభివృద్ధి విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ సహకరించలేదన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు లేరని, ఇక్కడి ప్రజల తరపున ప్రభుత్వాన్ని ఏదైనా అడిగేందుకు ప్రజాప్రతినిధి లేనందున అభివృద్ది కోసం ఇబ్బందులు తలేత్తుతాయన్నారు. ఈ ఎన్నికల్లో అయినా మల్కాజిగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అక్రమ కేసులు పెడుతున్నారని సానుభూతితో ఈటల రాజేందర్ ను బీజేపీ తరపున హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చారని అని ప్రశ్నించారు. కనీసం హోంమంత్రి అమిత్ షా తో చెప్పి కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించలేదన్నారు. కేసీఆర్ ను తిడుతున్న ఈటల రాజేందర్, తన కోడుకు కేటీఆర్ ను ఎందుకు తిట్టడంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

పదేళ్లలో ప్రధానీ మోడి తెలంగాణ అభివృద్దికి చేసిందేమీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. అకలి ఇండెక్స్ లో 125 దేశాల్లో 11వ స్థానంలో ఉందని ... ఇది నరేంద్ర మోదీ పాలనకు నిదర్శమని మండిపడ్డారు. ఆయన రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే.. అవి రద్దయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం చేసిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పేలా రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని అన్నారు. ప్రధాని ఓటమి భయంతోనే మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. హిందువుల ఆస్తులు ముస్లీంలకు పంచి పెడుతామని మోడి తప్పుడుప్రచారం చేస్తున్నారని చెప్పారు. మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశాన్ని మత సమరస్యానికి చిహ్నంగా ఉండేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

మతాలు, భాషల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ గెలవాలని చూస్తోందని, దేవుడి పేరు మీదు రాజకీయ చేసే వారిని పొలిమేర వరకు తరిమి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత రెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, జిల్లా ప్రెసిడెంట్ సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకట్ రెడ్డి, నాయకులు తోటకూర వజ్రేష్ యాదవ్, బండి రమేష్, కోలాన్ హన్మంత్ రెడ్డి, మందముల పరమేశ్వర్ రెడ్డి ,నక్కా ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed