అరకొర సౌకర్యాలతో నిమజ్జనాలు..

by Sumithra |
అరకొర సౌకర్యాలతో నిమజ్జనాలు..
X

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు ప్రాంతం పాపికొండలను తలపిస్తోందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. గణపతి నవరాత్రి అనంతరం నిమజ్జనాలు జరుగుతున్న వేళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్న మాటలవి. కానీ ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద నిమజ్జనాలు సరిగా జరగలేదని, అధికారులు ఎవరూ కూడా సరిగా సౌకర్యాలు కల్పించలేదని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ గుండ్ల రామతీర్థ ఆరోపిస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంతో భక్తితో భారీ ఎత్తున ఊరేగింపుతో వినాయక విగ్రహాలను చెరువు వద్దకు భక్తులు తెచ్చిన విగ్రహాలన్ని నీటిలో మునగకుండా కుప్పలుగా పడేశారని అన్నారు.

ఆగస్టు 30న కలెక్టర్ తో జరిగిన సమన్వయ సమావేశంలో గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నాలుగు క్రేన్ లను ఏర్పాటు చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఘట్కేసర్ మున్సిపాలిటీ కమిషనర్ ను పరిశీలించి ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. కానీ తొమ్మిదవ రోజు సోమవారం సాయంత్రం వరకు రెండు క్రేన్ లతో గణపతి నిమజ్జన కార్యక్రమాలు కొనసాగించారు. దానివల్ల భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం తాగునీటి వ్యవస్థ కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. లక్ష్మీనారాయణ చెరువులో దాదాపు 1700 పైగా వినాయక విగ్రహాలు నిమజ్జనాలు చేశారన్నారు. నిమజ్జనాల వద్ద మున్సిపల్ కమిషనర్ ఒకసారి కూడా కనిపించకపోగా కనీసం ఫోన్ చేస్తే కూడా స్పందించడం లేదని, ఆయన వైఖరి పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed