పాపం బిల్డర్లది.. శిక్ష కొనుగోలుదారులకా..?

by Sumithra |
పాపం బిల్డర్లది.. శిక్ష కొనుగోలుదారులకా..?
X

దిశ, మేడ్చల్ బ్యూరో : నగరాల్లో సొంత ఇల్లు ఉండాలని ఎవరు కోరుకోరు.. కొద్దోగొప్పో డబ్బు ఉంటే.. దానికి బ్యాంకు లోన్ జత చేసి ఓ ఇల్లు కొనేస్తున్నారు. అయితే మార్కెట్లో భూమి రేటు విపరీతంగా పెరగడంతో అక్రమార్కుల దృష్టి అసైన్డ్ భూములు, చెరువులపై పడింది. వీటిని ఆక్రమించి విల్లాలు అపార్టుమెట్లు కట్టేస్తున్నారు. తెలిసీ తెలియక అసైన్డ్ భూములు, చెరువులను కబ్జా చేసి నిర్మించిన అపార్టుమెట్లను, విల్లాలను కొని.. తీరా అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత లబోదిబో అంటున్నారు. ఇల్లు కట్టి అమ్మిన అక్రమార్కులు కోట్లకు కోట్లు తీసుకు పోతుంటే.. కొన్నవారు మాత్రం అటు డబ్బు, ఇటు ఇల్లు కోల్పోయి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు.

నిండా ముంచిన బిల్డర్లు..

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్‌లో లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ తమ కష్టమర్లను దారుణంగా మోసం చేసింది. ఈ సంస్థ సరైన అనుమతులు లేకుండా మల్లంపేట 170/3, 170/4, 170/5 సర్వే నంబర్లలో 260 విల్లాలను నిర్మించి కొనుగోలుదారులకు అంటగట్టింది.ఆ పక్కనే ఉన్న మల్లంపేట కాత్వ చెరువుకు చెందిన ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో సైతం 20కి పైగా విల్లాలను నిర్మించి విక్రయించింది.తద్వారా రూ. కోట్లు గడించింది. అయితే వీటిలో 8 విల్లాలను కూల్చివేయాలి, మిగతా వాటిని ఖాళీ చేయించి, ఇరిగేషన్ నిర్దేశించిన మార్కు ప్రకారం నోటీసులు ఇచ్చి కూలుస్తామని తాహసీల్దార్ మతీన్ పేర్కొంటున్నారు.దీంతో రూ. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విల్లాలను కూల్చేస్తామంటూ అధికారులు ప్రకటించడంతో కొనుగోలు దారులు అక్రోశానికి గురవుతున్నారు.

గతంలో హెచ్చరించినా..

చెరువు బఫర్‌జోన్‌ స్థలాన్ని, అసైన్డ్‌ స్థలాన్ని ఆక్రమించి విల్లాలను నిర్మించడంతో గత మూడేళ్ల క్రితం 100 విల్లాలను సీజ్‌ చేశారు. మిగిలిన 160 విల్లాలకు కూడా అనుమతులు లేనట్టు గుర్తించామని, వాటిని కూడా సీజ్‌ చేస్తామని అధికారులు ప్రకటించారు. అయినా బిల్డర్ మోసపూరిత మాటలను నమ్మి అక్రమ విల్లాలను కొనుగోలు చేశారు. ఒక్కో విల్లా రేటు రూ.కోటి నుంచి కోటిన్నర వరకు నిర్మాణదారులు విక్రయించారు.ఈ విల్లాలను ఇటివల హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.కాత్వ ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ లను అక్రమించి విల్లాలను నిర్మించినట్లు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చి విల్లాలను కూల్చేశారు. విల్లాలను కూల్చివేయడంతో వాటిని కొన్నవారు లబోదిబో అంటున్నారు.

ఇదే తరహాలో మాదాపూర్, సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అపార్ట్ మెంట్ ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో పలువురు స్థానికులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇలా తమ ఇళ్లను కూల్చడమేంటని ప్రశ్నిస్తున్నారు. పలువురు మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు నిరసన కారులను అడ్డుకుని వారించారు. ఈ నేపథ్యంలో బిల్డర్లు చేసిన మోసాలకు కొనుగోలుదారులు బలి అవుతున్నారు.

Advertisement

Next Story