ఎన్నిక ఏదైనా బీజేపీ దే విజయం : ఈటల రాజేందర్

by Kalyani |
ఎన్నిక ఏదైనా బీజేపీ దే విజయం : ఈటల రాజేందర్
X

దిశ, మేడ్చల్ బ్యూరో/శామీర్ పేట: అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో, పేపర్లలో, టీవీల్లో ప్రజలను మభ్యపెట్టేలా ప్రచారాలు చేస్తున్నారని, కానీ ప్రజలను మోసం చేయలేరన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ప్రతీ సంవత్సరం రూ. 2 లక్షల కోట్లు కావాలన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రూ.10 వేల కోట్లు తేవచ్చు గాక, కానీ ప్రతీ సంవత్సరం ఈ హామీలను ఎట్టి పరిస్థితిలో అమలు చేయలేరని రాజేందర్ స్పష్టం చేశారు. శామీర్ పేటలోని పుష్ప కన్వెన్షన్ లో బుధవారం నిర్వహించిన మల్కాజ్ గిరి నియోజకవర్గ కృతజ్ఠత సభలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి విస్మరించారు అన్నారు.

పోటీ పరీక్షలకు వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు అమానుషంగా లాఠీ ఛార్జ్ చేసి కేసులు పెట్టి జైలుకు తరలించడం తోనే కాంగ్రెస్ సర్కార్ కు రాష్ట్రంలో కాలం చెల్లింది అన్నారు. కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రావని ప్రచారం చేసి, కాంగ్రెస్ వల్లనే ఉద్యోగాలు వస్తాయని మభ్యపెట్టాడు. కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా తేలేదు. నిరుద్యోగులు, వారి కుటుంబాలు అందరూ బాధలు పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ, యువ మోర్చా మీకు అండగా ఉంటుందని ఈటల హామీ ఇచ్చారు. మహిళలకు పెన్షన్ లకు రూ.2,500 ఇస్తానని చెప్పి, ఇంతవరకు ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తానని ఆఖరుకు ముఖ్యమంత్రి దేవునిపై ప్రమాణం చేశాడని గుర్తు చేశారు.

ఎన్నిక ఏదైనా బీజేపీ దే విజయం...

మూడవసారి మోదీ పూర్తి మెజారిటీతో గెలవలేదని ప్రతిపక్షాలు హేళన చేస్తున్నాయని దుయ్యబట్టారు. కానీ భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రభంజనం ఏమాత్రం తగ్గలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేతలు ప్రధాని మోడీని చూసి ఈర్ష్య పడుతున్నారని, యుద్ధం జరిగే దేశాలకు వెళ్లి, శాంతి గురించి మాట్లాడే ధైర్యశాలి ప్రధాని మోడీ అని తెలిపారు. మూడవసారి వరుసగా ప్రధాని కావడం అంటే మామూలు విషయం కాదని, దేశంలో నెహ్రూ తర్వాత ఎవ్వరూ కాలేదన్నారు. దేశంలో పార్టీలన్నీ కలిపినా ఒక బీజేపీ పార్టీ కి వచ్చిన 240 పార్లమెంట్ సీట్లు రాలేదన్నారు. దేశ అభివృద్ధి బీజేపీ పార్టీ తోనే సాధ్యమని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని అన్నారు.

స్థానిక సంస్థలు, జిహెచ్ఎంసి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు ఏవి అయిన రాష్ట్రంలో బీజేపీ దే విజయం అని ఈటల జోష్యం చెప్పారు. భారతదేశం మొత్తంలో బీజేపీ ఓట్లు భారీగా పెంచుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు సమానమన్నారు. తెలంగాణను 4 భాగాలుగా విభజిస్తే, అందులో సెంట్రల్ తెలంగాణలో 45 శాతం ఓట్లు బీజేపీ సాధించగా, కాంగ్రెస్ కేవలం 21 శాతం ఓట్లు సాధించిందన్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. కేసులు పెట్టి, జైలు పాలు చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాగా పనిచేశారని ప్రశంసించారు.

కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలతో, డబ్బుతో బీజేపీ కి రావలసిన అధికారాన్ని కాంగ్రెస్ గుంజుకుందని ఘాటుగా విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో నా విజయం కోసం కష్టపడ్డ ప్రతి నాయకులను, కార్యకర్తలను గుండెలో పెట్టుకొని చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేలు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, నాగారం మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి, నాయకులు డాక్టర్ మల్లారెడ్డి, బి. చంద్రశేఖర్ యాదవ్, డి. మైసయ్య, శామీర్ పేట మండల బీజేపీ అధ్యక్షులు యాదగిరి, మూడు చింతలపల్లి అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story

Most Viewed