బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు

by Sridhar Babu |
బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు
X

దిశ,ఉప్పల్ : బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని బీసీ నేతలు తేల్చి చెప్పారు. హబ్సిగూడ కిన్నెర గ్రాండ్ హోటల్ లో గురువారం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీల డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఇది నాలుగో సమావేశమన్నారు. ఈ సమావేశంలో ఈడబ్ల్యూఎస్, ఎమ్మెస్ఎంఈ తో పాటు కులగణన అనే అంశంపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలు అప్రమత్తంగా ఉంటూ రాబోవు రోజుల్లో ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన విడుదల చేసిన జీవో 18 ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసేదాకా అప్రమత్తంగా ఉండాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జరిగే అనర్ధాలను వివరించారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వెబ్సైట్ ఆవిష్కరించిన అనంతరం, ఈ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో బీసీ నాయకులకు శిక్షణ ఇస్తామని తెలిపారు.

అనంతరం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ కులగణన చేసి స్థానిక సంస్థలలో బీసీలకు ఇచ్చిన మాట ప్రకారంగా 42 శాతాన్ని కేటాయించి వారి నిబద్ధతను నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అన్ని రంగాలలో బీసీల వాటా కోసం పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని, అన్ని పార్టీలు బీసీల వాటా తేల్చకుండా ఎన్నికల్లో బీసీ వర్గ ప్రజలకు అన్యాయం చేశాయని పేర్కొన్నారు. అంతా సంఘటితంగా పోరాడి తమ హక్కును సాధించుకుంటామని తెలిపారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన కుల గణన జీవోతో మనం సంతృప్తి చెందకుండా అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాలన్నారు.

కులగణన విషయంలో అగ్రవర్ణాల ఆధిపత్య పోరుతోపాటు, ఎన్నో కుట్రలు, కుతంత్రాలు దాగుండే అవకాశం ఉందని, దీంతో బీసీ వాదులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదులను గెలిపించుకోవాలని కోరారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కొత్త ఉద్యోగ సంఘాలతో పాటు ప్రజాసంఘాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాదుల శ్రీనివాస్ గౌడ్, ఎర్ర సత్యనారాయణ, చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు చామకూర రాజు, కేవీ గౌడ్, బత్తుల సిద్దేశ్వరులు, ఒంటెద్దు నరేందర్, దాసరి కిరణ్, బత్తిని కీర్తిలత, గోరా శ్యాంసుందర్, జర్నలిస్టు బాలాచారి, వసుమతి యాదవ్, కోట్ల వాసుదేవ్, చెన్నా శ్రీకాంత్, సంఘం సూర్యారావు, వాసు యాదవ్ తో పాటు పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed