- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లబ్ధిదారులకు చెమట చుక్క రాకుండా ఇల్లు కట్టిస్తున్నాం : మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
దిశ, పాపన్నపేట : ఈ నెల 14 నుంచి రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ల పంపిణీ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సోమవారం ఆయన పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్శి షాతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో పెద్దలు ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చూసి చూడు అనే సామెత ఊరికినే అనలేదని పేర్కొన్నారు.
ఎంతో కష్టం, ప్రయాసపడితే తప్ప ఇల్లు కట్టలేమన్నారు. అలాంటిది ఒక్క రూపాయి ఖర్చు కాకుండా చెమట చుక్క చిందించకుండా మీకు అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. పైరవీకారులకు పని లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇల్లు అందేలాగా కలెక్టర్ చేత ఇళ్ల మంజూరు చేయించామని మంత్రి హరీష్ రావు వివరించారు. ఈ నెలాఖరులోగా ఇంటి జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం అందిస్తామని, డబ్బు కూడా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే జమ అవుతాయని మంత్రి తెలిపారు.
కేంద్రలో బీజేపీ ప్రభుత్వం బోరు బాయికాడ మీటర్ పెట్టి రైతులకు బిల్లు పంపించాలని తెలంగాణపై ఒత్తిడి తెచ్చింది వెల్లడించారు. రైతు బోర్ల వద్ద మీటర్ పెట్టనందుకు రూ.30వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆపేసిందని వివరించారు. అయితే, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్ పెట్టేది లేదని తేల్చి చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పాలన అంటే ఏంటిది మీరు మర్చిపోయారా అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన అంటే నీళ్లకు కష్టం, కరెంట్ కు కష్టం, పెన్షన్ కి కష్టం అని హరీష్ రావు వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు అధిష్టానం ప్రజలేనని పేర్కొన్నారు. 2014 ముందు తర్వాత రాష్ట్ర అభివృద్ధి చూస్తే అర్థమవుతుందని ఆమె వెల్లడించారు. ఏన్కంపల్లి బ్రిడ్జి ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, దీంతో చాలా మండలాలకు లబ్ధి చేకూతురని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా రామతీర్థంలో మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రిని కోరారు. దీంతో మంత్రి స్పందిస్తూ వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకు ముందు మంత్రి హరీష్ రావు పాపన్నపేటలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజతో పాటు, పశు వైద్యశాల, లింగయ్యపల్లిలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
యాగశాల ప్రారంభం...
ఏడుపాయలలో నూతనంగా నిర్మించిన యాగశాలను మంత్రి హరీష్ రావు మెదక్ నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా ఏడుపాయలకు చేరుకున్న మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు వనదుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన యాగశాలకు చేరుకుని వేద బ్రాహ్మణులు శాస్త్ర యుక్తంగా మంత్రోచ్ఛారణల మధ్య యాగశాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి హోమం, దుర్గా హోమములు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో పాటు వివిధ శాఖల అధికారులతో పాటు పాపన్నపేట మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు గడీల శ్రీనివాస్ రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలగౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, లక్ష్మీ ఆటోని, స్రవంతి శ్రీనివాస్, పాపన్నపేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రంగపేట శ్రీనివాస్, రామతీర్థం బాబా గౌడ్, దోమకొండ కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.