ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా.. రైతు మృతి

by Shiva |   ( Updated:2023-04-28 12:46:24.0  )
ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా.. రైతు మృతి
X

దిశ, మద్దూరు: ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాలీ కింద పడి ఓ రైతు మృతి చెందిన ఘటన మద్దూరు మండల పరిధిలోని లద్నూరులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నంద ఎల్లయ్య (45) రైతు తన వరి పంటను కోయించి వడ్లను ట్రాక్టర్ ట్రాలీలో పోసుకొని ట్రాక్టర్ డ్రైవర్ బెడద సంపత్ తో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ బెడద సంపత్ కాలుకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్థులు తెలిపారు. రైతు నంద ఎల్లయ్య ఛాతి పైన ట్రాక్టర్ ట్రాలీ పడడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఓ కూతురు ఉంది. ఎల్లయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గ్రామస్థులు బోరున విలపించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మద్దూరు ఎస్సై నారాయణ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story