టేక్మాల్ సొసైటీ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చ

by Sridhar Babu |
టేక్మాల్ సొసైటీ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చ
X

దిశ, టేక్మాల్ : టేక్మాల్ సొసైటీ సర్వసభ్య సమావేశం రచ్చ రచ్చ గా మారింది. గురువారం టేక్మాల్ లోని సొసైటీ కార్యాలయంలో చైర్మన్ యశ్వంత్ రెడ్డి అధ్యక్షతన డైరెక్టర్లతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలకు సంబంధించి తీర్మానాలు చేసేందుకు చర్చలు ప్రారంభించారు. టేక్మాల్ సొసైటీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన సీఈఓ వేణుగోపాల్ ను సస్పెండ్ చేయడంతో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న శివకృష్ణను సీఈఓ గా పూర్తి బాధితులు అప్పగించాలని తీర్మానం చేసిన బిల్లును ఆర్సీఓ ఫయాజుద్దీన్ ఆమోదించారు. సస్పెండ్ అయిన సీఈఓ వేణుగోపాల్ ను తిరిగి విధుల్లోకి తీసుకోకుండా తీర్మానం చేసే సమయంలో చైర్మన్ యశ్వంత్ రెడ్డి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఆ సమయంలో మీరు ఎలా బయటికి వెళ్తారని, తీర్మానం చేశాక వెళ్లాలని డైరెక్టర్ పులి సత్యనారాయణ చైర్మన్ ను నిలదీయగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

అదే సమయంలో కార్యాలయంలో పనిచేస్తున్న సాయిలు అనే వ్యక్తి డైరెక్టర్ పులి సత్యం పైకి దూసుకెళ్లగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదే సమయంలో కార్యాలయం బయట ఉన్న వారి మద్దతుదారులు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకొని వచ్చారు. ఎవరికి వారు మద్దతు తెలువుతున్న క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో చైర్మన్ పెదవి పగిలి తీవ్ర రక్త స్రావం జరిగింది. దీంతో అక్కడున్న ఇతరులు ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతింపచేశారు. గాయపడ్డ చైర్మన్ ను చికిత్స నిమిత్తం జోగిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన తర్వాత దోషులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed