కల్తీ రహిత విత్తనాల జిల్లాగా తీర్చిదిద్దాలి : సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

by Shiva |
కల్తీ రహిత విత్తనాల జిల్లాగా తీర్చిదిద్దాలి : సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
X

దిశ సిద్దిపేట అర్బన్ : నకిలీ విత్తనాలు మరియు పురుగుల మందులను అరికట్టేందుకు గాను జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం అను ఏర్పాటు చేశామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నారు. జిల్లా వ్యవసాయ, పోలీస్ అధికారులతో నకిలీ విత్తనాలు, విడి విత్తనాల, పెస్టిసైడ్స్, సీడ్స్ పై సోమవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల స్థాయిలో అగ్రికల్చర్ అధికారులు, సబ్ ఇన్స్పెక్టర్ ఇరువురు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు.

ప్రతి గ్రామం నుంచి నకిలీ విత్తనాలు మరియు పురుగుల మందులపై ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా రైతులతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. గత మూడేళ్ల నుంచి నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించి సంబంధిత నిందితులను బైండోవర్ చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు కలిగి ఉన్నా మరియు అమ్మిన వ్యక్తులపై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తెలిపారు.

జిల్లాలో ఏ ఒక్క రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూసే బాధ్యత వ్యవసాయ అధికారులు, పోలీసులదేనని అన్నారు. షాపు పేరు లేకుండా విత్తనాలు అమ్మిన వారిపై కేసులు నమోదు చేయాలని, విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసిన బిల్లును తీసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో సీడ్స్ మరియు పెస్టిసైడ్స్ లైసెన్స్ షాపులు 627 ఉన్నాయని తెలిపారు. సెంటర్ సీడ్స్ లైసెన్స్ ఉన్న షాపులు 16 మాత్రమేనని అన్నారు.

పోలీసులు, వ్యవసాయ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బంది కలసి రైతు వేదికల ద్వారా నకిలీ విత్తనాలు, విడి విత్తనాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి షాప్ లో బిల్ బుక్స్, స్టాక్ రిజిస్టర్, బేసిక్ రిజిస్టర్లను తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. ప్యాకెట్, మ్యానుఫ్యాక్చర్, మరియు ఎక్స్పైర్ డేట్ ను తనిఖీ చేయాలని సూచించారు. ప్రతి సీడ్స్ షాంపిల్స్ తీసుకోవాలని సూచించారు. అందరి లక్ష్యం రైతులకు నాణ్యమైన విత్తనాలు, మందులు అందించమని అన్నారు.

జిల్లా ప్రజలకు, రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే.. 100 నెంబర్ కు డయల్ చేయాలన్నారు. లేని పక్షంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 8712667100 కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్.మహేందర్, సిద్దిపేట ఏసీసీ దేవారెడ్డి, గజ్వేల్ ఏసీపీ రమేష్, గజ్వేల్ సీఐ వీర ప్రసాద్, ఎస్సైలు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ అధికారులు అనిల్ కుమార్, బాబు, మహేష్, పద్మ, రాధిక, జిల్లాలోని మండలాల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed