నేత్రపర్వంగా లక్ష దీపోత్సవం.. బర్దిపూర్‌కు పోటెత్తిన భక్తులు

by Satheesh |   ( Updated:2022-12-09 13:30:17.0  )
నేత్రపర్వంగా లక్ష దీపోత్సవం.. బర్దిపూర్‌కు పోటెత్తిన భక్తులు
X

దిశ, ఝరాసంగం: దీపం జ్ఞానానికి చిహ్నం, వెలుగు అభివృద్ధికి మార్గం.. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి సమాజాన్ని విజ్ఞానం దిశగా జాగృతం చేయటమే దీపానికి లక్షణం.. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారని.. ఏ ఇంటిలో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని కృష్ణ యజుర్వేదం చెబుతోందని బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ పేర్కొన్నారు. శ్రీ దత్తాత్రేయ జయంతి ముగింపు సందర్భంగా గురువారం రాత్రి ఆశ్రమ ఆవరణంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం కన్నుల పండుగ కొనసాగింది.

ముందుగా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్, జహీరాబాద్ బీజేపీ ఇంచార్జ్ జంగం గోపి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మఠం బిక్షపతి స్వామితో కలిసి దత్త గిరి మహారాజ్ అద్దాల మండపం ప్రారంభించారు. అనంతరం లక్ష దీపోత్సవానికి జ్యోతి ప్రజ్వలన చేసి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు, హరహర శంభో శంకర, ధ్వనులుతో భారతీయ సంప్రదాయం విశిష్టతను తలపించేలా లక్షదీపోత్సవం నేత్రపర్వంగా సాగింది. లింగాకారంలో వెలిగించిన దీపోత్సవం దీపకాంతులతో కమనీయంగా కొనసాగింది. అనంతరం ఆశ్రమ ఆవరణంలో ఆధ్యాత్మిక ధర్మ సభను ఏర్పాటు చేశారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..

దత్త జయంతి సందర్భంగా గురువారం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కర్ణాటక, బీదర్, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు, చేసిన నృత్యాలు భక్తులను మంత్రముగ్ధులు చేశాయి. ఝరాసంగం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలను నుండే కాకుండా, కర్ణాటక, మహారాష్ట్ర, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వారికి ఆశ్రమ తరపున అన్నదానం ఏర్పాటు చేశారు.

ఘనంగా పల్లకి సేవ..

దత్త జయంతి ముగింపు సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ దత్తాత్రేయ స్వామివారి పల్లకి సేవ బర్దిపూర్ మాడవీధుల్లో ఊరేగించారు. బర్దిపూర్ కు చెందిన మహిళా భక్తులు నిండు కలశములతో పల్లకి స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల మధ్య సాగిన పల్లకి సేవ కార్యక్రమంలో కర్ణాటక చాంగులేర్‌కు చెందిన కళాకారులు చేసిన దండకాలు, ఖడ్గాలు, భజన కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed