ఏడుపాయల్లో 3 నుంచి శరన్నవరాత్రోత్సవాలు..

by Sumithra |
ఏడుపాయల్లో 3 నుంచి శరన్నవరాత్రోత్సవాలు..
X

దిశ, పాపన్నపేట : ఈ నెల 3 నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధిలో శరన్నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు పార్ధివశర్మ, శంకర్ శర్మలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మొదటి రోజు 3న స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తారన్నారు. మొదటి రోజైన గురువారం పాడ్యమిని పురస్కరించుకొని బాలాత్రిపుర సుందరి (ముదురు పసుపు) రూపంలో దర్శనమిస్తుందని, 4న గాయత్రీ దేవిగా (గులాబి), 5న అన్నపూర్ణ దేవిగా (నీలం), 6న వనదుర్గాదేవిగా (ఆకుపచ్చ), 7న మహాలక్ష్మి దేవిగా (పెసరు), 8న దుర్గాదేవి (ముదురు నీలం), 9న సరస్వతి దేవి (తెలుగు), 10న మహిషాసుర మర్దిని దేవిగా (ఎరుపు), 11న సర్వ నారాయణి దేవిగా (మెరూన్), చివరి రోజు 12న విజయదశమిని పురస్కరించుకొని రాజరాజేశ్వరి దేవి (పసుపు)గా వనదుర్గమ్మ దర్శనం ఇస్తారని తెలిపారు.

ప్రతిరోజు ప్రాతఃకాల సమయాన అమ్మవారికి అభిషేకం, ఉదయం విఘ్నేశ్వర పూజ తదితరాలు నిర్వహిస్తామని తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. 8న వనదుర్గామాతకు అంగరంగ వైభవంగా బోనాలు, 11న సుహాసిని పూజ, చండీ హోమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో పాల్గొని వనదుర్గామాత కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.

Advertisement

Next Story

Most Viewed