రైస్ మిల్లర్లకు కొమ్ము కాస్తే ఉపేక్షించేది లేదు.. మంత్రి కొండా సురేఖ

by Sumithra |
రైస్ మిల్లర్లకు కొమ్ము కాస్తే ఉపేక్షించేది లేదు.. మంత్రి కొండా సురేఖ
X

దిశ, మెదక్ ప్రతినిధి : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను మోసం చేసి మిల్లర్లకు కొమ్ము కాస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. గురువారం మెదక్ జిల్లా కలెక్టరేట్లో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జిల్లా అభివృద్ది పై నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పక్కగా అమలు చేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతీ ఒకరికి చేరువ చేయాలని ఆదేశించారు. రైతులకు ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, టాపర్లను ముందుగానే సరిపడినంత పెట్టుకోవాలన్నారు. తేమ మిషన్లు సరిగ్గా ఉన్నాయా లేవా అని పరిశీలించాలని, అన్ని సెంటర్లలో తేమ మిషన్లు అందుబాటులో ఉంచి తరుగు పేరిట రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు.

రైతులు తెచ్చిన ప్రతి గింజ కొనాలని, మిల్లర్లకు కాకుండా రైతులకు సపోర్ట్ గా నిలబడి పనులు చేయాలని సూచించారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను ఇష్టరీత్యా వసూలు చేయడాన్ని నియంత్రించాలని తెలిపారు. నిబంధనల ప్రకారమే అన్ని స్కూల్స్ కొనసాగాలని, పేదలను ఇబ్బంది పెట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే అలాంటి విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలన్నారు. ఫీజులు చెల్లించకుంటే సర్టిఫికెట్లు ఇవ్వకుండా పెట్టుకునే హక్కు యాజమాన్యాలకు లేదని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గం లేకపోవడం వల్ల గ్రామీణ ప్రజలకు సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకాధికారులు, పంచాయతీ సెక్రటరీలు అందుబాటులో ఉండి పరిష్కరించాలన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కు ఇవ్వని మిల్లుల పై పీడీ యాక్ట్ పెట్టడానికి సీఎం వెనుకాడటం లేదని తెలిపారు. వే బ్రిడ్జ్ ల తేడాలను పరిశీలించాలని తెలిపారు. అలాగే సహకార సంఘం సొసైటీల్లో జరిగిన కుంభకోణాల్లో సమగ్ర విచారణ జరిపి రికవరీ చేయాలన్నారు. అలాగే జిల్లాలో దేవస్థానాల అభివృద్దితో పాటు టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు తెలియజేశారు.

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో స్కాలర్ షిప్స్ విడుదల కాకపోవడంతో ఫీజులు చెల్లించని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని, దీంతో ఆ విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉపాధి అవకాశాలకు దూరం కావాల్సి వస్తుందని తెలిపారు. రైస్ మిల్లుల వద్ద ప్రతి సీజన్ లో వారం రోజుల పాటు ధాన్యం లారీలు అన్లోడ్ కాకపోవడం వల్ల రైతులు నిరీక్షిస్తూ అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వ ప్రాపర్టీ అవుతుందని, కాబట్టి జరిగే నష్టాన్ని రైతు పై వేయకుండా ప్రభుత్వమే భరించాలని తెలిపారు.

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ జిల్లాలోని కోనాపూర్, రెడ్డిపల్లి, ఇబ్రహీంపూర్ సహకార సొసైటీల్లో కోట్లలో కుంభకోణం జరిగిందన్నారు. వాటి పై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని తెలిపారు. అలాగే చేగుంటలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. కొనుగోళ్ల సమయంలో ధాన్యం తేమ విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, 4 కిలోల తరుగు పేరిట రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు. తేమ మిషన్లు అన్ని సెంటర్లలో పెట్టాలని తెలిపారు.

నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం మిల్లుకు వెళ్ళే సరికి తరుగు వస్తుందని తెలిపారు. సివిల్ సప్లై అధికారులు అంతా పోల్యుట్ అయ్యారని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు మిల్లర్లకు కొమ్ముకాస్తూ రైతులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్దనే ఎందుకు తూకం వేయాలని ప్రశ్నించారు. అక్కడ తరుగు వస్తుంది అని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతి స్టేజీలో బియ్యంలో తరుగు రావడం వలన డీలర్లు ప్రజల మీద తరుగు భారాన్ని మోపుతున్నారని తెలిపారు.

మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ గతంలో మాదిరిగా ప్రకటనలకే పరిమితమయ్యే ప్రభుత్వం కాదని తెలిపారు. ఏడుపాయల దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులను కేటాయించాలని కోరారు. టూరిజం డెవలప్మెంట్ కోసం నిధులు మంజూరు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు శెరి సుభాష్ రెడ్డి, యాదవ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, రోహిత్ రావు, సంజీవ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed