ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.. అదనపు కలెక్టర్ రమేష్..

by Sumithra |
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.. అదనపు కలెక్టర్ రమేష్..
X

దిశ, మెదక్ ప్రతినిధి : ధాన్యం కొనుగోలు వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో యాసంగి 2022-23 ధాన్యం కొనుగోలు, రైస్ మిల్లులో ధాన్యం దిగుమతి పై బాయిల్డ్ రైస్ మిల్లర్లు, జిల్లా ఏజెన్సీ ఉన్నతాధికారులతో బుధవారం టెలికాన్ఫరన్స్ నిర్వహించారు. జిల్లాలో అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా మొదలవడం, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ధాన్యం కొనుగోలును వెంటనే వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి మెదక్ ని ఆదేశించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం ట్యాబ్ ఎంట్రీ లో ఆలస్యం పైన జిల్లా సహకార అధికారి ట్యాబ్ ఎంట్రిలో సమస్యలు అధిగమిస్తూ వేగవంతం చేయటం పైన ఆదేశాలు జారీచేశారు. రైతుల ధాన్యం వెనువెంటనే కొనుగోలు చేసి, ధాన్యం చెల్లింపులు చేయటం ప్రథమ కర్తవ్యంగా భావించాలని సూచించారు. రైస్ మిల్లులలో ధాన్యం దిగుమతికి ఉన్న అడ్డంకులను మిల్లర్లను అడిగి తెలుసుకున్నారు. బాయిల్డ్ మిల్లర్లు తమ వద్ద ఉన్న హమాలీ సంఖ్యను పెంచుకొని వచ్చిన లారీలను వెంటనే ఖాళీ చేసి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు ఆలస్యం అయ్యింది అని వెనువెంటనే కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రారంభించి కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు.

మిల్లర్లు వెంటనే లారీలు దిగుమతి చేసి కేంద్రాలకు ఆటంకం లేకుండా లారీలు తిప్పి పంపాలని సూచించారు. మిల్లర్ల అధ్యక్షులు మాట్లాడుతూ మిల్లర్ల సమస్యలను ప్రస్తావిస్తూ త్వరితగతిన బియ్యం డెలివరీ పూర్తి అయితేనే ధాన్యం దిగుమతికి స్థలం ఏర్పడుతుంది అని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాటిని కేటాయిస్తే వెనువెంటనే నాణ్యమైన బియ్యం డెలివరీ చేయగలం అని తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి మెదక్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను పరిష్కరిస్తూ వెంటనే ధాన్యం మిల్లులకి తరలించాలని సూచించారు. ధాన్యం ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ చేయాలని మిల్లర్లు వెంటనే ట్రక్ చిట్లను కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు ఇవ్వాలని, ఆకనలెడ్జిమెంట్ పూర్తి చేయాలని సూచించారు. ఈ సమీక్షలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి కరుణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్, ఇఫ్కొ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా మిల్లర్ల అధ్యక్షులు చంద్రపల్, బాయిల్డ్ మిల్లర్లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed