వడ్డేపల్లి అటవీ ప్రాంతంలో మరోసారి చిరుత పులి సంచారం

by Kalyani |
వడ్డేపల్లి అటవీ ప్రాంతంలో మరోసారి చిరుత పులి సంచారం
X

దిశ, దౌల్తాబాద్ : వడ్డేపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చిరుత పులి మరోసారి కలకలం రేపింది. రెండు కుక్కలపై దాడి చేసింది. మళ్లీ చిరుత సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు చిరుత పులి ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. శుక్రవారం దుబ్బాక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ వడ్డేపల్లి గ్రామ అటవీ ప్రాంతాన్ని సందర్శించి గ్రామ ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోలాగే వడ్డపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అడవి పక్కన వ్యవసాయ పొలాలు ఉన్న రైతులు తెలిపారు. వేముల రాజమల్లయ్య వ్యవసాయ పొలం వద్ద రెండు కుక్కలపై దాడుచేసి చంపేసిందన్నారు.

శుక్రవారం ఉదయం యాదగిరి అనే రైతు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి దాడికి గురైన కుక్కలను అక్కడ ఉన్న పాదముద్రలను గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడం జరిగిందన్నారు. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా కుక్కల పై దాడి చేసింది, అక్కడ ఉన్న పాదముద్రలు పరిశీలించి చిరుత పులిగా గుర్తించడం జరిగిందన్నారు. చిరుతపులి జాడ కోసం అడవిలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని చిరుత పులి ఎప్పుడు ఒకే చోట నివాసం ఉండదని తరచూ తిరుగుతుంటుందని తెలిపారు. అడవికి దగ్గరగా వ్యవసాయ పొలాలు ఉన్న రైతులు గొర్రెలు, మేకలు, పశువులను పొలాల వద్ద ఉంచకుండా ఇండ్లలోకి తీసుకొచ్చుకోవాలన్నారు.

గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. చిరుతపులి జాడ కోసం అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. పొలాల వద్దకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులెవరూ పొలాల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్, బీట్ ఆఫీసర్ వేణు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed