రైతుల మేలు కోసమే ప్రభుత్వ తాపత్రయం: మంత్రి హరీష్ రావు

by Web Desk |   ( Updated:2022-02-10 14:45:03.0  )
రైతుల మేలు కోసమే ప్రభుత్వ తాపత్రయం: మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలం గుర్రాలగొంది గ్రామంలో గురువారం గుర్రాల గొంది గ్రామస్తులకు 124, సికిందలాపూర్ గ్రామస్తులకు 21 స్ప్రింక్లర్ల సెట్లను మంత్రి హరీశ్ రావు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అంతర పంటలు వేసి కొత్త పద్ధతులు అందిపుచ్చుకునేలా రైతులు ముందుకు రావాలన్నారు. నియోజకవర్గంలోనే మొదటిసారి ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్న ఈ గ్రామానికి అత్యధిక సెట్లు అందిస్తున్నట్లు తెలిపారు.

మీ మేలు కోసమే మా ప్రభుత్వ తాపత్రయమని, డ్రిప్ స్ప్రింక్లర్ సెట్ల పైపులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచడం తప్ప, రైతులకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం దగా ప్రభుత్వమని, చేసే ప్రతీ పని రైతులకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్పుకొచ్చారు. పార్లమెంటులో పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు.

ఖమ్మం లోని సత్తుపల్లిలో అక్కడి రైతులు అంతర పంటలు వేసి రెండింతలు సంపాదన ఆర్జిస్తున్నారని అవగాహన కల్పించారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు 3 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే చందలాపూర్ లో 350 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నట్లు వివరించారు. ఆయిల్ ఫామ్, మల్బరీ సాగుకై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తున్నదని మంత్రి తెలిపారు.

గుర్రాలగొందికి నాలుగు లైన్ల రహదారి..

త్వరలోనే గుర్రాలగొంది గ్రామానికి నాలుగు లైన్‌ల రహదారి రానున్నదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. త్వరలోనే నాలుగు లైన్‌ల రహదారి ఈ గ్రామం మీదుగా వస్తుందని.. డివైడర్లు, వీధి దీపాలు వస్తాయన్నారు. ఇప్పటికే సిద్దిపేట నుంచి రామంచ వరకు పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed