ఎన్నడూ లేని విధంగా జాతర ఏర్పాట్లు : ఎమ్మెల్యే రోహిత్

by Naresh |
ఎన్నడూ లేని విధంగా జాతర ఏర్పాట్లు : ఎమ్మెల్యే రోహిత్
X

దిశ, పాపన్నపేట: మహాశివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే మహా జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేశామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మహాశివరాత్రి రోజున అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆది యోగి ఉత్సవ మూర్తి వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి జాతర ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సర్వీసును ఎమ్మెల్యే రోహిత్ ప్రారంభించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేయగా కమిటీ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డిలు శాలువాలతో సత్కరించారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, రమేష్, ఆర్డీవో రమాదేవి అమ్మవారిని దర్శించుకుని జాతర ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ.. వన దుర్గమ్మ చల్లని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, పాడి, పశు సంపద వృద్ధి చెంది ఆర్థికాభివృద్ధి సాధించాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఎన్నడూ లేని విధంగా ఏడుపాయల జాతర ఉత్సవాలను ఈ సంవత్సరం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏడుపాయలను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటూ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. ఏడుపాయల జాతరను ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశామన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో తొలి రోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభమైన ఈ జాతర కోసం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక చింతనతో భక్తులు తాకిడి క్రమేపి పెరుగుతుందని ఆ వనదుర్గ అమ్మవారిని దర్శించుకుని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story