ఆహారం బాగా లేదని..చిన్న వార్త వచ్చినా.. చర్యలు తప్పవు : కలెక్టర్

by Kalyani |
ఆహారం బాగా లేదని..చిన్న వార్త వచ్చినా.. చర్యలు తప్పవు : కలెక్టర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఆహారం బాగా లేదని, పిల్లలు అస్వస్థతకు గురయ్యారని ఇలాంటి ఏ చిన్న వార్త వచ్చినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి హెచ్చరించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో విద్య, సోషల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్, సివిల్ సప్లై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...విద్యాసంస్థలలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని ఒక్కొక్కటిగా ప్రాధాన్యత మేరకు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ, గురుకులాలు, మోడల్ స్కూల్, కేజీబీవీ, ప్రభుత్వ దవాఖానాల్లో మంచి నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని మాత్రమే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు నాణ్యమైన భోజనం అందించడమే ధ్యేయంగా అడిషనల్ కలెక్టర్ సారధ్యంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ కమిటీ పని చేస్తుందన్నారు.

నాణ్యమైన సరుకుల విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు. ప్రతి విద్యాసంస్థలలో ఆహారం తయారు కాగానే చెక్ చేసి రుచి చూసేందుకు ఒక టెస్టింగ్ అధికారిని నియమించాలని తెలిపారు. విద్యాసంస్థలలో భోజనం మెనూ తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి విద్యాసంస్థలలో న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంగన్ వాడీలకు, విద్య సంస్థలకు సరఫరా చేసే ఫుడ్ క్వాలిటీ తప్పని సరిగా చెక్ చేయాలన్నారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన భోజనం అందించని ఏజెన్సీలను రద్దు చేయాలని సూచించారు. పిల్లలకు విద్యాసంస్థల్లో తరుచు క్యాంపులు నిర్వహించి మందులు అందజేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story