రైతులందరికీ రుణమాఫీ అయ్యేవరకు విడిచిపెట్టం

by Sridhar Babu |
రైతులందరికీ రుణమాఫీ అయ్యేవరకు విడిచిపెట్టం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రైతులందరికీ రుణమాఫీ అయ్యేవరకు విడిచిపెట్టమని, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాదని.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు రూ.రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, అన్ని పంటలకు బోనస్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ, రూ. 7500 రైతు భరోసా, మహిళలకు రూ.2500, వృద్ధులకు 4000 పెన్షన్ అమలు చేయకుండా కుంటి సాకులు చెప్తున్నాడని మండిపడ్డారు. రైతులు, మహిళలు, వృద్ధులకు మేలు జరగడం కంటే తనకు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదన్నారు. 31 రకాల కుంటి సాకులతో పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడం హాస్యాస్పదం అన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసే వరకు సీఎం రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. దసరా నాటికి రుణమాఫీ అమలు కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ స్తంభింపచేస్తాం అని, రైతుల అందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. రేషన్ కార్డుతో ముడిపెట్టి రుణమాఫీ చేయని కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంది అన్నారు. సన్న వడ్లతో పాటుగా దొడ్డు రకాలకు 500 రూపాయలు బోనస్ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పంటలు కోతలకు వచ్చినా రైతు భరోసా మాత్రం బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటుగా కరోనా కష్ట సమయంలో కూడా సమయానికి రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.

కాలేశ్వరం ప్రాజెక్టులు రెండు పిల్లర్లు కుంగితే కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. కాలేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లోకి గోదావరి జలాలు ఎలా వచ్చాయని సూటిగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి కూలగొట్టడం తప్ప కట్టడం తెలియదని ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మాట్లాడుతూ...ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకు 5 వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీల అమలు మారిచిన కాంగ్రెస్ పార్టీకి స్ధానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. అంతకుముందు రుణమాఫీ అమలు కాని రైతులతో తన్నీరు హరీష్ రావు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed