జిల్లా ఆసుపత్రిలో క్యాత్ లాక్ సేవలు: మంత్రి హరీష్ రావు

by Shiva |
జిల్లా ఆసుపత్రిలో క్యాత్ లాక్ సేవలు: మంత్రి హరీష్ రావు
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు స్టంట్ వేసేలా క్యాత్ ల్యాక్ సేవలను త్వరలో ప్రారంభించబోతున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంగళవారం జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యం, పౌర సరఫరాలు, వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్అండ్బీ, నీటి పారుదల శాఖలకు సంబంధించి చర్చ జరిగింది.

ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఆసుపత్రుల బెడ్ల సంఖ్యను పెంచామన్నారు. గర్భిణీల కోసం జిల్లా ఆస్పత్రిలో టిఫా స్కాన్ ఏర్పాటు చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ నెలలో న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదే విధంగా షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు ఎన్సీడీ కిట్స్ అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంపై మహిళలకు అవగాహన పెంచాలని, సీపీఆర్ పై అందరికీ అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని కోరారు. అన్ని నియోజకవర్గాలలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెచ్చామని, అవసరమైన వారు వినియోగించుకునేలా చూడాలని మంత్రి తెలిపారు.

లైసెన్స్ లేకుండా అనధికారంగా వైద్యం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో ఏఎన్ఎం సబ్ సెంటర్లు అద్దే భవనాల్లో ఉండకుండా, భవనాలు నిర్మిస్తున్నామని, 54 సబ్ సెంటర్ భవనాల నిర్మాణానికి ఒక్కొక్క దానికి రూ.20 లక్షలు ఇచ్చామని తెలిపారు. వాటినింటిని త్వరలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 3లక్షల కి.మీ దాటిన 108 అంబులెన్స్ లు (200) తీసివేసి వాటి స్థానంలో కొత్తవి 200 అంబులెన్స్ లను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

నెలన్నర లోపు కొత్తవి వస్తాయన్నారు. కంటి వెలుగు బాగా కొనసాగతోందని, జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రతిరోజూ ఒక్కసారైనా శిబిరాలకు వెళ్లి పరిశీలించాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 85శాతం ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. అందుకు అంకిత భావంతో పని చేస్తున్న డాక్టర్లను వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని, కరెంట్ కొనుగోలుతో అదనంగా నెలకు రూ.వేయి కోట్ల నంచి రూ.1,500 కోట్ల భారం ప్రభుత్వం భరిస్తుందన్నారు.

రైతుల కోసం ఎంత రేటు అయినా పెట్టి కొనుగోలు చేయమని సీఎం తెలిపారని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా భరోసా కల్పిస్తుందని మంత్రి అన్నారు. ఎండ తీవ్రతల దృష్ట్యా ఉపాధి హామీ కూలీలతో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు పని చేయించాలని, పూర్తి వేజ్ వచ్చేలా చూడాలని గ్రామీణ అభివృద్ధి అధికారికి సూచించారు. వ్యవసాయ బావుల వద్ద రైతుల మోటార్లకు మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల నిధులు ఆపివేసిందని, రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులకు ఆటంకం కలగకుండా ఆపివేసిన నిధులను ఇవ్వాలని సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

అదే విధంగా పలువురు జడ్పీటీసీలు వివిధ శాఖలకు సంబంధించిన ప్రశ్నలను సందించారు. ఈ సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పోరేషన్ డెవలప్ మెంట్ చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డా.శరత్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, చంటి క్రాంతి కిరణ్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కో ఆప్షన్ మెంబర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story