వీగిన అవిశ్వాసం.... మళ్లీ పాతవారికే పగ్గాలు

by Naresh |
వీగిన అవిశ్వాసం....  మళ్లీ పాతవారికే పగ్గాలు
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డిలో మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసం నెగ్గాలంటే సుమారు 22 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. కానీ బీఆర్ఎస్‌కు కేవలం 12 మంది కౌన్సిలర్ల మద్దతు మాత్రమే ఉంది. మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి పై అవిశ్వాస తీర్మాణం పై సంతకాలు చేసి మద్దతిచ్చిన పలువురు కౌన్సిలర్లను తమ వైపుకు తిప్పుకున్నారు. వారికి అనుకూలంగా ఉన్నవారిని క్యాంపుకు తీసుకుపోయారు. అవిశ్వాసానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్, బీజేపీ సభ్యులు సంతకాలు చేసి మద్దతు పలికారు. కానీ అవిశ్వాస సమయం దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్, బీజేపీలతో పాటు పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు ఉపసంహరించుకుంటామని చైర్ పర్సన్‌కు హామి ఇచ్చారు.

ఇందులో భాగంగానే వారు అవిశ్వాస తీర్మానం సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా మున్సిపల్ చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసంపై గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఫైనల్ రిజల్ట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా రెవెన్యూ డివిజనల్ అధికారి వసంత కుమారిని నియమించారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాలతో లేఖ డీ1/350/2024, ఈ నెల 14న ఇచ్చిన లేఖ ప్రకారం సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ పై మున్సిపల్ కౌన్సిలర్లు గత నెల 12న సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై పరిశీలించేందుకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.

మున్సిపాలిటీలో ఎన్నికైన 37 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లలో ఏ ఒక్కరు కూడా సమావేశానికి హాజరు కాలేదన్నారు. నియమావళి 10(3) ప్రకారం అరగంటసేపు వారి రాక కోసం నిరీక్షించిన అనంతరం ఈ సమావేశం మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశామన్నారు. ఈ విషయం సభ్యులకు తెలియజేసేందుకు సదరు నోటీసును పురపాలక కార్యాలయం నోటీసు బోర్డులో అతికించామన్నారు. అనంతరం ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించామని తెలిపారు. అయినప్పటికీ ఏ ఒక్క సభ్యులు కూడా హాజరు కాలేదని అందుకే సమావేశం నిర్వహించేందుకు కావాల్సిన కోరం లేనందువల్ల చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి పై ప్రతిపాదించబడిన అవిశ్వాస తీర్మానం సదరు నియమావళి10(3) ప్రకారం వీగిపోయిందని ఆమె వెల్లడించారు.

అవిశ్వాసానికి హాజరుకాని కౌన్సిలర్లు..

సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టగా, అవిశ్వాస తీర్మానం రోజున ఒక్క కౌన్సిలర్ కూడా హాజరు కాలేదు. సంగారెడ్డిలోనే ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు అందుబాటులో ఉన్నా కూడా తమకు మెజార్టీ లేదని వెళ్లినా కూడా అవిశ్వాసం వీగిపోతుందని తాము సమావేశానికి వెళ్లలేదని వారు ప్రకటించారు. ఇక చైర్ పర్సన్‌కు మద్దతు ప్రకటించిన కౌన్సిలర్లు బొంగుల విజయలక్ష్మీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని, తాము వెళ్లకపోయినా పర్వాలేదని వారు కూడా సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఎన్నికల అధికారి వసంతకుమారి బొంగుల విజయలక్ష్మి పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. దీంతో బొంగుల విజయలక్ష్మి మున్సిపల్ చైర్ పర్సన్ గా కొనసాగనున్నారు.

ఈ నెల 10న కాంగ్రెస్‌లోకి మున్సిపల్ చైర్ పర్సన్..?

బీఆర్ఎస్ చైర్ పర్సన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అవిశ్వాసం వీగిపోయేలా చేశారు. అవిశ్వాసానికి ప్రస్తుత ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరోక్షంగా మద్దతు ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 10 వ తేదీన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చైర్ పర్సన్‌తో పాటు కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. వీరందరు కాంగ్రెస్‌లో చేరిన వెంటనే మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఇక సంగారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ పరం కానున్నది. ఇక స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తారో చూడాలి మరి.

Advertisement

Next Story