పార్టీ పరువు తీస్తే సహించను.. T-కాంగ్రెస్ నేతలకు థాక్రే వార్నింగ్

by Satheesh |
పార్టీ పరువు తీస్తే సహించను.. T-కాంగ్రెస్ నేతలకు థాక్రే వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​పార్టీ బలోపేతానికి సరైన విధానంలో పనిచేయకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చునని ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్​వ్యవహరాల ఇంచార్జీ మాణిక్​రావు థాక్రే తేల్చిచెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో 34 మంది పార్లమెంట్ సెగ్మెంట్‌ల​హాథ్ సే హాథ్ కార్యక్రమాల ఇంచార్జీలతో సమీక్ష నిర్వహించగా, కేవలం 9 మంది మాత్రమే వచ్చారు. దీంతో అసంతృప్తి చెందిన థాక్రే.. డుమ్మా కొట్టిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వయంగా రాష్ట్ర ఇంచార్జీ హోదాలో తాను సమీక్షను నిర్వహిస్తే, రాకపోవడానికి గల కారణాలను వెంటనే తెలియపరచాలని హాథ్​సే హాథ్​ ఇంచార్జీలకు అంతర్గతంగా సూచించారు. షెడ్యూల్​ప్రకారం తాను గురువారం తిరిగి వెళ్లాల్సి ఉన్నా, పాదయాత్ర సమీక్ష కోసం తన షెడ్యుల్‌ను మరో రెండు రోజుల పాటు పొడిగించినట్లు చెప్పారు.

ఫొటోల కోసం పాదయాత్రలు వద్దని, ప్రజల కోసం పనిచేయాలని హాథ్​సే హాథ్​టీమ్‌కు సూచించారు. ప్రతీ పార్లమెంట్​సెగ్మెంట్‌ను తానే స్వయంగా పరిశీలిస్తానని, పర్యవేక్షణ శూన్యత కనిపించకూడదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఉన్నదని, అందరూ కలసి కట్టుగా పనిచేస్తే అధికారంలోకి రావడం ఖాయమని థాక్రే నేతలకు వివరించినట్లు తెలిసింది. కానీ కొందరు కాంగ్రెస్‌లోనే అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు.

మరోవైపు కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై థాక్రే వివరణ కోరినట్లు తెలిసింది. పార్టీ పరువు బద్నాం చేసే కుట్రలు అవసరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పాదయాత్ర ఎప్పట్నుంచి ప్రారంభిస్తావో? తేదీని తనకు తెలియజేయాలని థాక్రే కోమటిరెడ్డికి సూచించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పార్టీలో ఉంటూ నష్టం చేకూర్చే చర్యలకు పాల్పడితే సహించేది లేదని థాక్రే నొక్కి చెప్పారు. కార్యకర్తలను, పార్టీ ముఖ్య నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నించోళ్లు ఏ స్థాయిలో ఉన్నా, అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed