- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆర్టీసీకి సవాలుగా మారిన ‘మహాలక్ష్మి’ స్కీమ్.. బస్సుల కొరతతో ప్రయాణికుల కలత!

మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి పెద్ద సవాలుగా తయారైంది. పెరుగుతోన్న ప్రయాణికుల సంఖ్యకు తగినట్లుగా బస్సుల సంఖ్య పెరగకపోవడంతో ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ నెలకొంటుంది. ఉచిత ప్రయాణానికి అనుగుణంగా బస్సు సర్వీసులు పెంచకపోవడంతో ఆర్డినరీ/ఎక్స్‌ప్రెస్ బస్సులన్నీ మహిళా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మహిళ కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. పథకానికి తగ్గట్టుగా.. అవసరమైనన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు నడపకపోవడంతో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బస్సుల కోసం బస్టాపుల్లో ఎదురు చూస్తున్నారు. గత రెండు నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొన్నా.. ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదు. గ్రామీణ మహిళలు పల్లె వెలుగు బస్సులపై ఆధారపడుతున్నారు. పల్లె వెలుగు సర్వీసులను పెంచాల్సి ఉన్నప్పటికీ..ఆర్టీసీ అధికారులు చలించడం లేదు. ఆదాయ మార్గాలున్న రూట్లోనే సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను నడుపుతూ.. మహాలక్ష్మి పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ పథకానికి సంబంధిత అధికారులు పాత బస్సుల్నే వినియోగిస్తున్నారు. అవి ఎక్కడకక్కడ మొరాయించడంతో..సకాలంలో మహిళలు గమ్య స్థానాలకు చేరుకోలేకపోతున్నారు.
ఏడాదిన్నరలో 114 కోట్ల మంది ఉచిత ప్రయాణం
మహాలక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుంచి జనవరి నెలాఖరు వరకు పరిశీలిస్తే.. 114 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నట్టు తేలింది. వారికి రూ.3,802.30 కోట్ల విలువైన జీరో టిక్కెట్లను ఆర్టీసీ సిబ్బంది జారీ చేశారు. ఉచిత ప్రయాణం చేసే వారికి ప్రభుత్వం ప్రతినెల రూ.300 కోట్లు చెల్లిస్తోంది. దీంతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా...వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనిపిస్తోంది. బస్సుల సంఖ్య తగ్గించడంతో టికెట్ల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు. 2024 వరకు రాష్ట్రంలో 3,339 పల్లె వెలుగు బస్సులు ఉండగా, జనవరి నాటికి 3100 వరకు అవి చేరుకున్నాయి.
ఆదాయ మార్గాల్లో బస్సులు పెంపు
ఉచిత బస్సు చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుండగా.. ఆదాయ మార్గాలు ఉన్న రూట్లో ఆర్టీసీ అధికారులు కొత్త బస్సులు ప్రవేశపెట్టి లోటును భర్తీ చేసుకుంటున్నారు. 2022 వరకు రాష్ట్రవ్యాప్తంగా 586 సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు 239 బస్సులు ఉండేవి. గత ఏడాది నాటికి వాటి సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం సూపర్ లగ్జరీ బస్సులు- 693, డీలక్బస్సులు-306 ఉన్నట్టు అంచనా. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 46 లక్షల మంది నిత్యమూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా, మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తరువాత వాటిసంఖ్య 61 లక్షలకు చేరింది. ఇందులో దాదాపు మహిళలే 60 శాతం ఉన్నట్టు అంచనా. చాలా బస్సులోని ఎక్కువ సీట్లులో మహిళలే కనిపిస్తున్నారు. రోజుకు దాదాపు 40 లక్షల వరకు మహాలక్ష్మి పథకం ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. బస్సులు పెంచకపోవడంతో ఒక్కొక్క బస్సులో 80 నుంచి 100 మందికి వరకు ప్రయాణిస్తున్నట్టు కండక్టర్లు పేర్కొంటున్నారు.
పురుషులతోనే ఆర్టీసీకి ఆదాయం
పురుషుల ప్రయాణంతోనే ప్రస్తుతం ఆర్టీసీకి ఆదాయం సమకూరుతుంది. పేద, మధ్యతరగతికి చెందిన పురుషులు ఆర్టీసీ బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. రోజుకు 20 లక్షల నుంచి 22 లక్షల మంది పురుషులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఉచిత ప్రయాణికులతో సీట్లు నిండిపోగా, టికెట్లు చెల్లించిన పురుషులు నిలబడి ప్రయాణిస్తున్నారు.
బస్సులు కొనుగోలు చేయాలి : ఆర్టీసీ జేఏసీ నాయకులు
మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టిన ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచడం ఉత్తమని ఆర్టీసీ జేఏసీ నేతలు సలహా ఇస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నప్పటికీ.. మరికొంత బడ్జెట్పెంచి 1000 వరకు పల్లె వెలుగు బస్సులు పెంచితే రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన ప్రయాణం లభిస్తోందని వారు సూచిస్తున్నారు. మూలకు చేరిన బస్సులను బయటకి తెచ్చి..వాటికి మరమ్మతులు చేయిస్తే..ప్రయాణికుల రద్దీని తట్టుకోడానికి వీలుంటుందన్నారు. లగ్జరీ, డీలక్స్ బస్సుల కొనుగోలు వైపే మొగ్గు చూపితే.. రానున్న రోజుల్లో మహాలక్ష్మి పథకానికి బస్సుల కొరత ఏర్పడడమే కాకుండా.. పథకం లక్ష్యం నీరుగారే అవకాశం ఉందని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు.