- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇల్లు ఇవ్వలేదని కడసారి చూపు కూడా చూడని కర్కశ కొడుకు

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : ఆ తండ్రికి.. ఇద్దరు కూతుళ్లు.. ఓ కుమారుడు. హైందవ సంప్రదాయం ప్రకారం ఆ తండ్రి తనువు చాలిస్తే అంత్యక్రియలు నిర్వహించాల్సిన బాధ్యత కొడుకుది. కానీ ఆ తండ్రి తన పేరిట ఉన్న ఇంటిని తనకు కాకుండా తన సోదరీమణి పేరిట రిజిస్ట్రేషన్ చేశాడన్న కోపముతో ఓ కొడుకు తండ్రి కర్మకాండల సంగతి అటునుంచి.. కడసారి చూపు చూసేందుకు రాకపోవడంతో బంధువులు.. మిత్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి కి చెందిన మాణిక్యరావు (80) సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించాడు. మాణిక్యరావు దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు.. అందరి వివాహాలు జరిపించాడు. భార్య గతంలోనే మరణించడంతో.. తనకున్న ఆస్తిలో సొంత ఊరిలో ఉన్న 15 ఎకరాల వ్యవసాయ పొలం, రూ.60 లక్షలు తన కొడుకు గిరీష్ కి ఇచ్చి.. మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలో ఉన్న ఇంటిని ఆర్ధికంగా బలహీనతన పెద్ద కూతురు రాజనందిని పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఇంటిలో బిడ్డల సంరక్షణలో ఉన్న మాణిక్యరావు అనారోగ్యానికి గురై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
హైదరాబాదులో ఉన్న గిరీష్ కు సోదరీమణులు విషయాన్ని తెలియజేశారు. ఇంటిని తనకు కాకుండా చేశాడు .. నేను అంత్యక్రియలకు రాను అని గిరీష్ చెప్పడంతో ఆ సోదరీమణులు.. 'అన్న ఆ ఇంటిని ముగ్గురం సమానంగా తీసుకుందాం.. నాన్న అంత్యక్రియలు నిర్వహిద్దాం రా' అంటే.. అతని గుండె కరగలేదు.. బంధువులు మిత్రులు ఎంతగా చెప్పినా రాను అని తేల్చి చెప్పాడు.అంతకుముందే అక్కడికి చేరుకున్న సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు 'మీరు అంత్యక్రియలు నిర్వహించకుంటే' మేము నిర్వహిస్తాం అని గట్టిగా చెప్పడంతో.. బంధువులు, మిత్రులు కుమారుడు రాకున్నా అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. చిన్న కూతురు రఘు నందిని అంతిమ యాత్ర ముందు నడిచి.. తండ్రికి తలకొరివి పెట్టింది. తండ్రి పై మమకారం కన్నా.. ఆస్తికే ప్రాధాన్యతను ఇచ్చిన కొడుకు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.