అన్ని రంగాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలి : ఎమ్మెల్యే యెన్నం

by Kalyani |
అన్ని రంగాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలి : ఎమ్మెల్యే యెన్నం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: అన్ని రంగాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నదే తన ప్రధాన ధ్యేయం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, స్కిల్ డెవలప్మెంట్ పైన ప్రత్యేక దృష్టి సారించి, నిరుద్యోగ యువతకు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిందని, 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చిందని, త్వరలో మరికొన్ని వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వస్తాయని ఆయన అన్నారు. ఈ నెల 16 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిష్ణాతులైన అధ్యాపకులతో ఉత్తమమైన శిక్షణ ఇస్తామన్నారు.

అలాగే ఉపాధ్యాయ నియమకాలకు టెట్, డీఎస్సీ పరీక్షల కోసం, వీఆర్ఏ, వీఆర్వో, గ్రూప్ 1, 2, 3, 4 వంటి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ నిరంతర ప్రక్రియ కొనసాగిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. 'ఫస్ట్' పేరుతో నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ నియామకాలకు ఉచిత శిక్షణా తరగతులను ప్రారంభించడం ఎమ్మెల్యే కృషిని అభినందించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ 'ఫస్ట్' కోచింగ్ సెంటర్ అడ్మిషన్ ఫాం ను గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ రియాజ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, టీపీసీసీ కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, సిరాజ్ ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed