రాజీవ్ యువవికాసం పథకం ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ బీఎం సంతోష్

by Sumithra |
రాజీవ్ యువవికాసం పథకం ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ బీఎం సంతోష్
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా, త్వరిత గతిన నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాజీవ్ యువ వికాసం పథకం పై ప్రత్యేక డీసీసీ బ్యాంకుల సమావేశం, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్ఆర్ఎస్ పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు.

జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుండి 25,500 దరఖాస్తులు అందాయని, వాటిలో 8000 దరఖాస్తులను సెక్టర్ల వారీగా పారదర్శకంగా స్కూటీని చేయాలన్నారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా అధికారులు ఆధార్, ఆదాయం, కుల దృవీకరణ పత్రాలతో పాటు అర్హత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దరఖాస్తులను డౌన్ లోడ్ చేసి, కార్పొరేషన్ వారీగా, బ్యాంకులు శాఖల వారీగా వర్గీకరించి సోమవారంలోగా సంబంధిత బ్యాంకు మేనేజర్లకు సమర్పించాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకు మేనేజర్లకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారంలోగా అర్హత నివేదికను అందజేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో దరఖాస్తుల పరిశీలన 28మే వరకు నిర్వహించాలన్నారు. మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి అర్హత ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల పనుల లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి పై మండలాల వారీగా సమీక్షించిన కలెక్టర్, ప్రతి మండలంలో గ్రౌండింగ్, బేస్‌మెంట్, మార్క్ అవుట్, రీ వెరిఫికేషన్, పూర్తి వివరాలు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మంజూరైన ఇండ్లలో 10 శాతం ఇండ్లకు బేస్‌మెంట్ పనులు ఒక వారంలోపే పూర్తయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం మొదలయ్యేలోగా మంజూరు ప్రక్రియ పూర్తి చేసి, నిర్మాణ పనులు వేగంగా ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల జాబితా తీసుకుని, అర్హతను పరిశీలించి, నిర్మాణానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ఇండ్ల నిర్మాణాన్ని పంచాయతీ కార్యదర్శితో సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

నిర్మాణ‌ ద‌శ‌ల‌ను బ‌ట్టి దశలవారీగా ల‌బ్దిదారుల‌కు ప్ర‌తి సోమ‌వారం నాడు వారి ఖాతాలోనే నేరుగా డ‌బ్బుల‌ను జమచేయడం జరుగుతుందని అన్నారు. ఏప్రిల్ 30 లోపు ఫీల్డ్ వెరిఫికేషన్‌ను పూర్తిచేసి, అర్హులైన వారినే తుది జాబితాలో ఎంపిక చేయాలని ఆదేశించారు. నిరుపేద అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ కొరకు వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ రమేష్ బాబు, ఇంచార్జ్ ఎల్డీయం శ్రీనివాస రావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Next Story

Most Viewed