KTR : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి

by Kalyani |
KTR : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : వలసల జిల్లా పాలమూరు కరువు కోసం తీర్చేందుకు మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 90 శాతం పూర్తి చేసిన పాలమూరు- రంగారెడ్డి పనులను పూర్తి చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం నగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చేరుకొని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం నేరెళ్లపల్లి గ్రామంలో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు.. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు గోస తీర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-'రంగారెడ్డి ను చేపట్టి 90% కు పైగా పనులు పూర్తి చేయించారు.


ఏదుల, వట్టెం, కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లు దాదాపు పూర్తి అయ్యాయి. కాలువలు తీసి నీళ్లు పారించవలసి ఉండగా .. పాలమూరు బిడ్డను అనే పదేపదే చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎత్తిపోతలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ కనిపిస్తాడు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని పక్కన పెట్టారు అని పేర్కొన్నారు. నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 4350 కోట్ల పనులను మెగా ఇంజనీరింగ్, రాఘవ కంపెనీలకు సగం సగం పనులను అప్పగించడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


అప్పట్లో మెగా ఇంజనీరింగ్ కంపెనీని విమర్శించిన రేవంత్ రెడ్డి అదే కంపెనీకి ఇప్పుడు ప్రాజెక్టు పనులను అప్పగించడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా సుంకిశాల లో 75 నుంచి 80 కోట్లకు పైగా నష్టం వాటిల్లడానికి కారణమైన మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టకుండా ప్రాజెక్టు పనులను ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని కోరారు. సాధ్యమైనంత త్వరలోనే కేసీఆర్ ఆమోదంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను సందర్శించి పరిస్థితులను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ వెల్లడించారు. మహబూబ్ నగర్ పట్టణంలో సర్వేనెంబర్ 523లో 2007వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదలకు పట్టాలు ఇచ్చింది.


ఆ పట్టాల ఆధారంగా పేదలు ఇండ్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి 70 ఇండ్లను కూల్చివేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ ఇండ్లు కోల్పోయిన వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. పేదల ఇండ్లు కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, గణేష్ గుప్తా తదితరులతో కలిసి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Advertisement

Next Story