ఆహా ఓహో అద్భుతమైన మార్కెట్‌కు ఆదరణ ఏది

by Naresh |
ఆహా ఓహో అద్భుతమైన మార్కెట్‌కు ఆదరణ ఏది
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: ఆహా ఓహో అద్భుతమని గత ప్రభుత్వ హయాంలో రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ సముదాయం వృథాగా మారింది. ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్‌కు ఆదరణ కరువైంది. వాస్తవానికి షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ నిర్మించిన స్థలం ఆర్టీసీకి చెందినది కాగా అప్పటి ఆర్టీసీ సంస్థతో మాట్లాడి మ్యూచువల్‌గా ఒక నిర్ణయానికి వచ్చి ఆర్టీసీకి చెందిన స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లో పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించే వారితోపాటు చిరు వ్యాపారులు ఇక్కడ తమ వస్తువులను అమ్ముకునేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు.

షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం తర్వాత కొద్ది రోజుల పాటు ఇక్కడ వ్యాపారులు విక్రయాలు చేపట్టిన తర్వాత పూర్తిగా షాపింగ్ కాంప్లెక్స్ సముదాయంలో విక్రయాలు చేసేవారే లేకుండా పోయారు. తీరా అధికారులు ఎందుకిలా జరుగుతుందని పరిశీలిస్తే షాపింగ్ కాంప్లెక్స్‌లో విక్రయాలు జరపడానికి సిద్ధమైన కొనుగోలుదారులు అటువైపుగా రావడం లేదని విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. చివరకు మున్సిపల్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది సమిష్టిగా బలవంతంగా నైనా చిరు వ్యాపారులు ఇక్కడ విగ్రహాలు జరపాలని తమదైన శైలిలో వ్యాపారులతో సమావేశం నిర్వహించిన వారికి నచ్చజెప్పినా కూడా ఇప్పటికీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా ఉంది. ఇంటిగ్రేటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభోత్సవం 2023 జనవరి 24వ తేదీన చేశారు. దాదాపుగా ఏడాదిన్నర దగ్గర పడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ వినియోగంలో మార్పు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అధికారులు దృష్టి సారించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పునరాలోచన చేసి ప్రజా అవసరాల మేరకు తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed