అధికారులు టీమ్ వర్క్ గా పని చేయాలి : కలెక్టర్

by Kalyani |
అధికారులు టీమ్ వర్క్ గా పని చేయాలి : కలెక్టర్
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేందుకు అన్ని శాఖల అధికారులు టీమ్ వర్క్ గా సమన్వయంతో సమర్థవంతంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర సూచించారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అన్ని శాఖల అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు తమ వంతు కృషి చేయాలని సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులు పరిష్కరించడంలో గుణాత్మకంగా సమస్యల పరిష్కారం చూపాలన్నారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల సమన్వయంతో అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యం, వ్యాధుల నివారణకు ముందస్తు కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను అనుసరించి చేపట్టాలని ఆమె వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. వానాకాలం సాగు పంటల విస్తీర్ణం, పంటల సాగు, ఎరువులు, విత్తనాల సరఫరా గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎరువులు సరఫరా గురించి ప్రతిరోజూ రిపోర్ట్ చేయాలని ఆమె జిల్లా వ్యవసాయ అధికారికి వివరించారు. పాఠశాలలు ప్రారంభమైనవి కాబట్టి ఒక జత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ సరఫరా చేసినట్లు డీఈఓ రవీందర్ తెలిపారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా పాఠశాలల్లో అత్యవసర మరమ్మతులు 5 రకాల పనులు చేపట్టినట్లు, మొదటి దశలో 490 పాఠశాలలో పనులు పూర్తి కావచ్చినట్లు, రెండవ దశలో 152 పాఠశాలల్లోని పనులు పురోగతిలో ఉన్నట్లు ఆయన వివరించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇంటర్ విద్య, వైద్య ఆరోగ్య శాఖ, పౌరసరఫరాల, జిల్లా గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, మిషన్ భగీరథ, మున్సిపాలిటీ,గనులు, భూగర్భ శాఖ, తదితర శాఖల అధికారులు తమ పనుల పురోగతిని వివరించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed