MahabubNagar: పుర పాలనకు కౌంట్ డౌన్..!

by Ramesh Goud |
MahabubNagar: పుర పాలనకు కౌంట్ డౌన్..!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/వనపర్తి టౌన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈనెల 26వ తేదీతో మునిసిపాలిటీ పాలకమండలి పాలనకాలం ముగియనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19మునిసిపాలిటీలు ఉండగా, జడ్చర్ల మున్సిపాలిటీ మినహాయించి మిగిలిన 18మునిసిపాలిటీల పదవీకాలం ముగియనుండడంతో.. పరిపాలన స్పెషల్ అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. మరో అయిదు ఆరు నెలల వరకూ మునిసిపాలిటీల ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోవడంతో, ప్రత్యేక అధికారుల పాలన తప్పదనే నిర్ణయానికి ఇటు పాలకులు, అటు ప్రజానీకం వచ్చారు.

జిల్లాల వారీగా మున్సిపాలిటీల వివరాలు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 19మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, భూత్పూర్ మునిసిపాలిటీల పాలకమండలి పాలన కాలం ఈనెల 26తో ముగియనుంది. జడ్చర్ల మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలు ఆలస్యంగా జరిగిన నేపథ్యంలో ఇక్కడ యధావిధిగా పాలకమండలి తమ పాలన కొనసాగించనుంది. నారాయణపేట జిల్లాలో కోస్గి, నారాయణపేట, మక్తల్, గద్వాల జిల్లాలో గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి, వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి మున్సిపాలిటీలు, నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి మున్సిపాలిటీల పాలన కాలం 26వ తేదీతో ముగియనుంది.

అభివృద్ధికి నోచుకోని మునిసిపాలిటీలు..

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాత మున్సిపాలిటీలే కాదు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలోనూ చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. అన్న ఆరోపణలు ఉన్నాయి. పలు మున్సిపాలిటీలలో పాలకమండలి సభ్యులు తమ సొంత పనులు, సంపాదనపై చూపిన శ్రద్ధ మునిసిపాలిటీల అభివృద్ధిపై చూపకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి అన్న విమర్శలు ఉన్నాయి. నిధులు విడుదల కాకపోవడం.. వల్ల అభివృద్ధి ఎక్కడికి అక్కడే నిలిచిపోయింది. పలు మున్సిపాలిటీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేస్తాని గత పాలకులు పలుమార్లు ప్రకటించినా.. అమలుకు నోచుకోలేదు. అంతర్గత రోడ్లు.. పారిశుధ్యలోపం.. తదితర సమస్యలు మునిసిపాలిటీలను వెంటాడుతున్నాయి.

స్పెషల్ అధికారులుగా జిల్లాస్థాయి అధికారులు..

మునిసిపాలిటీ ఇలా పాలకమండలి పదవీకాలం ఈనెల 26న ముగియనుండడంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మునిసిపాలిటీలకు స్పెషల్ అధికారులను నియమించే ప్రక్రియ ఆరంభమైంది. జిల్లాస్థాయి అధికారులను స్పెషల్ అధికారులుగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

ఎన్నికల కోసం ఆశావాహుల ఎదురుచూపులు..

ఈనెల 26వ తేదీన మునిసిపాలిటీ పాలకమండలి సభ్యుల పదవీకాలం ముఖ్యం ఉండడంతో.. అవకాశం దక్కించుకొని కౌన్సిలర్లుగా.. మున్సిపల్ చైర్మన్ లుగా, గెలవాలని పలువురు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల ప్రక్రియ స్థానంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రిజర్వేషన్లను ప్రకటిస్తుందని ప్రచారం జరుగుతుండడంతో.. రిజర్వేషన్లకు అనుగుణంగా రంగంలోకి దిగాలన్న ఆలోచనలతో పలువురు ఆశావహులు ఉన్నారు. మొత్తంపై మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడంతో ఆశావాకులు కొంత నిరాశ నిష్పరులకు గురవుతున్నారు.



Next Story

Most Viewed