Mahaboob Nagar: ఎమ్మెల్యేల రూట్ చేంజ్..! విమర్శలు మాని, అభివృద్దిపై దృష్టి

by Ramesh Goud |
Mahaboob Nagar: ఎమ్మెల్యేల రూట్ చేంజ్..! విమర్శలు మాని, అభివృద్దిపై దృష్టి
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: గత ఏడదిగా మాజీ మంత్రులు, మాజీఎమ్మెల్యేలు.. ముఖ్య నాయకులను టార్గెట్ గా చేసుకుని కొంతమంది ఎమ్మెల్యేలు పలు సందర్భాలలో వ్యాఖ్యానాలు చేస్తూ రాజకీయంగా వేడిని పుట్టించారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను గురించి చెబుతూనే.. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అక్కడక్కడ జరిగిన ప్రజావ్యతిరేక విధానాలపై ఘాటుగా విమర్శలు చేస్తూ వచ్చిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు రూటు మార్చారా..!? అంటే అవును అనే సమాధానాలు వస్తున్నాయి. వారి వారి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటనలు చేస్తూ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గురించి మాత్రమే ప్రజలకు వివరిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం లేదు.. ఈ తతంగం వెనక సీఎం రేవంత్ రెడ్డి మంత్రాంగం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

విమర్శలు చేస్తే.. వాళ్లే షైన్ అవుతారు..

అదే పనిగా.. ప్రతిపక్ష పార్టీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పిస్తుంటే.. వాళ్లు క్రమక్రమంగా షైన్ కావడానికి అవకాశాలు ఉంటాయని .. పనిగట్టుకొని విమర్శలు చేయరాదని ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు సూచించినట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. నియోజకవర్గాలలో అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువ కావాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలపై ఘాటుగా విమర్శలు చేసే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉంటున్నారు.

అభివృద్ధి లక్ష్యం కావాలి..

ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు అవకాశం దక్కింది. బూర్గుల రామకృష్ణారావు తర్వాత మళ్లీ ఈ జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకొని అభివృద్ధి చేసుకోకుంటే.. చరిత్ర మనలను క్షమించదు.. ఎన్ని అవాంతరాలు అయినా జిల్లాను అభివృద్ధి చేసుకుందాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే చెబుతూ వస్తున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా గడ్డన జరిగిన రైతు పండగ లోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రతి ఏటా 20 వేల కోట్ల చొప్పున.. మొత్తం లక్ష కోట్లతో జిల్లా అభివృద్ధి చేసి తీరుతాము అని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి.. ప్రతిపక్షాల నుండి ఎటువంటి ఆటంకాలు ఎదురుగా కాకుండా.. అభివృద్ధి పనులు సజావుగా సావగాలన్న లక్ష్యంతో పనిచేయాలి అని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు రైతు పండగ తర్వాత జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి మాట్లాడుతున్నారు. తప్ప ప్రతిపక్షాల నేతల పై విమర్శలు బాగా తగ్గించారు.

20లక్షల ఎకరాలకు సాగునీరు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు, ఎత్తిపోతలను పూర్తిచేసి ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు అడుగులు వేస్తున్నారు. సాగునీటి వనరులతో పాటు.. జిల్లాలో పరిశ్రమలను పెద్ద ఎత్తున స్థాపించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న లక్ష్యంతో ఆయన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రణాళికలు సిద్ధం చేసుకుని కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాలను దక్కించుకొని గట్టి పట్టు సాధించేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు.



Next Story

Most Viewed