వనపర్తిలో...రచ్చకెక్కిన చెత్త పంచాయతీ...

by Kalyani |
వనపర్తిలో...రచ్చకెక్కిన చెత్త పంచాయతీ...
X

దిశ ప్రతినిధి వనపర్తి : అస్తవ్యస్త పాలనతో అష్ట కష్టాలు పడుతున్న వనపర్తి ప్రజలకు ఇంటింటి చెత్త సేకరణ చేసే ఏజెన్సీ వారితో కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. చెత్త పై విధించిన పన్నును పాలకవర్గం నిర్ణయించిన దాని ప్రకారం కాకుండా అదనంగా వసూలు చేస్తూ దోపిడికి పాల్పడుతున్నారు. చెత్త పై పన్ను విధించడమే విడ్డూరంగా ఉంది అనుకుంటుంటే డిమాండ్ చేసి మరి అదనంగా వసూలు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఆయా వార్డులలో చెత్త సేకరణ నిర్వాహకులను నిలదీస్తుండడంతో వారు ఎదురు తిరిగి ప్రజలతో తరచూ గొడవకు దిగుతున్నారు. దీంతో జిల్లా కేంద్రంలో చెత్త పంచాయతీ రచకెక్కినట్లు అయింది.

ప్రైవేట్ ఏజెన్సీ ఇష్టారాజ్యం...

పారిశుద్ధ్య సిబ్బంది తక్కువగా ఉన్నారని, చెత్త సేకరణ భారంగా మారిందని కారణాలు చూపుతూ గత పాలకవర్గం ఇంటింటి చెత్త సేకరణ పనులను ప్రైవేటు ఏజెన్సీకి కట్టబెట్టారు. ఒక ఇంటి నుంచి నెలకు రూ. 60 వ్యాపార సముదాయాలు అయితే రూ. 100 నుంచి రూ. 500 వరకు , కళ్యాణ మండపాలకు రూ.1000 చొప్పున వసూలు చేయాలని అప్పట్లో తీర్మానం చేశారు. అయితే చెత్త సేకరణ పనులు చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ వారు నిర్ణయించిన ధరలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా జనాల నుంచి వసూలు చేస్తున్నారు. ఇండ్ల ముందరికి చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడు ఆ ఇంటి వారే చెత్తబుట్టలు ఆటోలో వేస్తే రూ. 60 చొప్పున ఒకవేళ చెత్త సేకరణ సిబ్బంది తాము ఎక్కడున్నా చెత్త ఆటోలో వేసుకుంటే రూ. 150 చొప్పున వసూలు చేస్తున్నారు.

రోజు ఇచ్చే చెత్త కంటే అదనంగా ఉన్నా, ఇళ్లల్లో ఏవైనా శుభకార్యాలు జరిగి అధిక పరిమాణంలో చెత్త వేసినా ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే. లేకపోతే చెత్తను అలాగే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇదేమని అడిగితే తగాదాకు దిగుతున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఇక ఇటీవల చాలామంది ప్రజలు ఇళ్లల్లో వినాయక చవితి వేడుకలు జరుపుకొని అనంతరం మిగిలిపోయిన పూజా సామాగ్రిని తీసుకెళ్లమంటే అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. 30 వార్డులో ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన చెత్త సేకరణ సిబ్బంది తరచూ కాలనీవాసులతో గొడవకు దిగుతున్నారు.

ప్రతినెలా లక్షల్లో భారం...

ఇంటింటికి చెత్త సేకరణ పై పన్ను విధిస్తూ సదరు కార్యక్రమాన్ని ప్రైవేటు ఏజెన్సీకి అప్పజెప్పడం ద్వారా ప్రతినెల ప్రజలపై లక్షలాది రూపాయల ఖర్చు అదనపు భారంగా మారింది. వనపర్తి మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు ఉండగా మునిసిపాలిటీకి చెందిన 13 ట్రాక్టర్లు, మరో నాలుగు మినీ ఆటోల ద్వారా 16 వార్డులలో చెత్త సేకరణ చేపడుతున్నారు. ఇక 10 ట్రాలీ ఆటోలతో 17 వార్డులలో ప్రైవేట్ ఏజెన్సీ వారు చెత్త సేకరణ చేస్తున్నారు.

వనపర్తి పట్టణంలో అధికారికంగా 16 వేల ఇండ్లు ఉండగా వాటిలో మరికొన్ని కుటుంబాలు అద్దెకు ఉండడంతో అన్నీ కలిపి మొత్తం దాదాపు 40 వేల కుటుంబాలు అవనున్నాయి. వీరందరితో నెలకు రూ.60 వసూలు చేసినా రూ. 24 లక్షలు అవుతాయి. ఇక అలాగే గుర్తింపు పొందిన 1100 వ్యాపార సంస్థలు జిల్లా కేంద్రంలో ఉన్నాయి. వీటి ద్వారా సైతం లక్షల ఆదాయం ఏజెన్సీ కి సమకూరుతుంది. ఈ భారం మొత్తం ప్రజలు మోయాల్సి వస్తుంది.

ఏజెన్సీ నిర్వాకంతో రోడ్ల పాలవుతున్న చెత్త...


ఇంటింటికి చెత్త సేకరణ చేపడుతున్న ప్రైవేట్ ఏజెన్సీ వారు పాలక వర్గం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేయడం, చెత్త పరిమాణం ఎక్కువగా ఉంటే వందల రూపాయలు డిమాండ్ చేస్తుండడంతో విసిగిపోయిన కొందరు జనాలు రాత్రి సమయంలో చెత్త మూటలను రహదారుల పక్కన పారేస్తున్నారు. దీంతో వనపర్తి జిల్లా కేంద్రంలో రహదారుల సమీపంలో చెత్త నిల్వలు, ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి.

అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం... ఉమామహేశ్వర్ రెడ్డి శానిటేషన్ అధికారి


ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా నిర్దేశించిన ప్రకారమే ఏజెన్సీ నిర్వాహకులు ప్రతి నెల డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అధిక మొత్తంలో వసూలు చేస్తే అయా వార్డుల ప్రజలు మాకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రతి ఇంటి నుంచి నెలకు రూ. 60 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story