జడ్చర్లలో మరోసారి హైనాల హల్ చల్.. దాడిలో రెండు మేకల హతం..

by Kalyani |
జడ్చర్లలో మరోసారి హైనాల హల్ చల్.. దాడిలో రెండు మేకల హతం..
X

దిశ, జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధి మూడో వార్డు రాజీవ్ నగర్ కాలనీలో మరోసారి రెండు హైనాలు హల్ చల్ చేశాయి. శనివారం మటన్ వ్యాపారి యాజమాని అశోక్, తన ఇంటి సమీపంలో ఉన్న కాంపౌండ్ వాల్ లో 10 మేకలను ఉంచాడు. కాగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో రెండు హైనాలు మేకల మందపై దాడి చేయడంతో రెండు మేకలు చనిపోగా, కొన్ని మేకలకు గాయాలైనాయి. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. శనివారం కాంపౌండ్ వాల్ లో ఉన్న మేకలకు మేత వేయడానికి మటన్ వ్యాపారి భార్య వెళ్లగా, అప్పటికే రెండు హైనాలు మేకల మందపై దాడి చేస్తూనే ఉన్నాయి.

దీంతో ఆమె కేకలు వేయడంతో హైనాలు ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేయగా, ఆమె తప్పించుకుని అలాగే కేకలు వేయడంతో రెండు హైనాలు కాంపౌండ్ వాల్ దూకి పారిపోయినట్లు ఆమె తెలిపారు. జడ్చర్ల నడిబొడ్డున ప్రజా సంచారం ఉన్న ప్రాంతంలో హైనాలు చొరబడి మేకల మందపై దాడి చేయడం పట్ల రాజీవ్ నగర్ కాలనీ ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే హైనాలను గుర్తించి నిర్బంధించి అడవిలోకి తరలించాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల హైనా దాడిలో 9 మేకలను నష్టపోయిన వ్యాపారి అశోక్, శనివారం మరోసారి హైనాలు మేకలపై దాడి చేయడంతో మరో రెండు మేకలను కోల్పోయాడు.

Advertisement

Next Story