KTR : ఇండ్లు కోల్పోయిన వారికి నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూంలు ఇవ్వండి

by Kalyani |   ( Updated:2024-09-14 12:40:46.0  )
KTR :  ఇండ్లు కోల్పోయిన వారికి నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూంలు ఇవ్వండి
X

దిశ, నాగర్ కర్నూల్ : మహబూబ్నగర్ పట్టణంలో పేద ప్రజలు, వికలాంగులని చూడకుండా వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సుమారు 75 ఇండ్లను కూల్చివేశారు. వారికి వెంటనే తమ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ,ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తదితరులు ఇటీవల మరణించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహం నేరేళ్లపల్లి గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.... రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డ అయితే 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డిని వెంటనే పూర్తి చేయాలని అన్నారు.

కేసీఆర్ కు పేరు వస్తుందని పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయకుండా వదిలేశారని ఆరోపించారు. కాంట్రాక్టు కమిషన్ల కోసమే ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పారని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి, ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కాంట్రాక్ట్ ఏజెన్సీకి పనులు అప్పగించారని మండిపడ్డారు. త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటన షురూ చేస్తామన్నారు. తమ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వారితో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు ఉన్నారు.

Advertisement

Next Story