- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భూభారతి తో రైతుల సమస్యలకు చెక్.. అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి

దిశ, అలంపూర్ టౌన్: అలంపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ ఫంక్షన్ హాల్ లో సోమవారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి 2025 చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే విజయుడు కలెక్టర్ సంతోష్ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చట్టాలు చేస్తే ప్రజల మేలు కోసం ఉండాలి గాని ప్రజలపై పెత్తనంలో ఉండకూడదని ధరణినీ ఉద్దేశించి విమర్శించారు. ఎన్నికల ముందు ఏం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ధరణి స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి సంవత్సర కాలంలోనే భూభారతి చట్టం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా చాలా ఇబ్బందులు అనుభవించారని, కార్యాలయాల చుట్టు కాళ్లు అరిగేలా తిరిగారని, అధికారులు కూడా నిస్సహాలుగా ఉండి పోయారని అన్నారు.ఈ దుస్థితిని మారుస్తూ, పేద రైతుల కన్నీళ్లను తుడిచే ఉద్దేశంతో డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ జయంతి నాడు భూభారతి చట్టాన్ని ప్రారంభించామన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రైతులకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రభుత్వం అన్ని కోణాలలో, మేధోమథనం చేసిన మీదట సమగ్ర అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రతి వారం కలెక్టర్,తహసీల్దార్ సహా సంబంధిత అధికారులతో సమీక్షలు జరిపి భూ సమస్యల పరిష్కారంపై స్వయంగా పర్యవేక్షణ చేస్తానని ఎంపీ తెలిపారు.
బాకీలు కడుతూనే సంక్షేమ కార్యక్రమాల అమలు..
గత ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్లు అప్పలు చేశారని,వారు చేసిన భాకీలకు అసలు, వడ్డీలు కడుతూనే.. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేరుస్తుందని అన్నారు. రైతులు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, రైతు భరోసా ఇస్తున్నామని, సన్నాలకు రూ. 500 బోనస్,ఇందిరమ్మ ఇండ్లు, రూ. 500 సిలిండర్ రాయితీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 40 శాతం మెస్ చార్జీలు పెంపు, సమీకృత గురుకుల పాఠశాలలు, రేషన్ షాపు ద్వారా పేదలకు సన్న బియ్యం,పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ,రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షలు, రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు,ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు.
ఈ విధంగా ప్రభుత్వం రైతుల, పేదల, మహిళల,యువత కోసమే కట్టుబడి పనిచేస్తోందని,ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల భూమి వివాదాలను పరిష్కరించి, భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టంలో 23 సెక్షన్లు మరియు 18 నిబంధనలున్నాయని తెలిపారు. ఆధార్ తరహాలో భవిష్యత్తులో భూములకు సంబంధించి సర్వే చేసి, హద్దులు, కొలతలు, భూముల వివరాలు ఒకే పుస్తకంలో ఉండేలా ‘భూధార్’ను రూపొందించనున్నట్లు తెలిపారు. సాదా బైనామాల పరిష్కారం వేగవంతమవడంతో పాటు, వారసత్వ మ్యూటేషన్, హక్కుల సంక్రమణను గడువులో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.
భూ సమస్యలు జిల్లా స్థాయిలోనే పరిష్కారం..
ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే భూ భారతి చట్టం ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తు చేసుకుంటే న్యాయం జరగలేదని భావిస్తే ఆర్డీవోకు, అక్కడ కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ చట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడినదని, భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్‌కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భూభారతి ద్వారా భూమికి సంబంధించిన సమస్యలు జిల్లా స్థాయిలోనే సత్వరం పరిష్కారం అవుతాయని అన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై అవగాహనను ఏర్పర్చుకోవాలని, దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు హితవు పలికారు. భూభారతి చట్టం వల్ల రైతులకు, పేదలకు ఎంతో మేలు కలుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అంతకముందు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఆలంపూర్‌లో జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంపూర్ శాసనసభ్యులు విజయుడు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు భూ భారతి చట్టంపై అవగాహన పెంపొందించుకొని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని అన్నారు. పలువురు రైతులు ధరణిలో ఏర్పడిన సమస్యలను ఎంపీ,కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, డి.సి.సి.బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడ్డప్ప, అలంపూర్ తహసీల్దార్ మంజుల, మున్సిపల్ కమిషనర్ చంద్ర శేఖర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.