దేవుని సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసి, రైతుల రుణం తీర్చుకుంటా : రేవంత్ రెడ్డి

by Disha Web Desk 11 |
దేవుని సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసి, రైతుల రుణం తీర్చుకుంటా : రేవంత్ రెడ్డి
X

దిశ,కొత్తకోట /వనపర్తి : దేవుని సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం రాత్రి కొత్తకోట మండలం కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధు సుధన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తనపై చూపిన ప్రేమకు తన్మయత్వం చెందానని, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేశామన్నారు.

గజ్వేల్ నుండి కేడి వచ్చిన ఢిల్లీ నుంచి మోడీ వచ్చిన ప్రజల ఆశీర్వాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తధ్యమన్నారు. గల్లి గల్లి లో వాల్ రైటింగ్స్ రాసిన తనను సీఎంను చేశారన్నారు. దేవుని సాక్షిగా పంద్రా ఆగస్టు లోపు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని, హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఐదు మాసాలు కూడా పూర్తికాని కాంగ్రెస్ ప్రభుత్వంను కూల్చాలని ఢిల్లీకి సద్దులు మోసే పార్టీ నాయకులు, ప్రజలను మోసం చేసిన పార్టీలు పన్నాగాలు పన్నుతూ పగటి కలలు కంటున్నారన్నారు. పదవులు, వ్యాపారాలపై ఉన్న ఆసక్తి ఈ ప్రాంత అభివృద్ధి, ఉపాధి కల్పనపై చూపని వారు మళ్లీ ఓటు అడిగే హక్కు లేదన్నారు.

గత పది సంవత్సరాలుగా తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ పార్టీని కర్రు కాల్చి బుద్ధి చెప్పాలన్నారు. ఏబిసిడి వర్గీకరణ, ముదిరాజ్ లను ఏ గ్రూప్ లో,బోయలకు ఎస్టీ జాబితాలో చేర్చాలన్న, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థులు వంశీచందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి లను లక్ష మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Read More..

తెలంగాణకు కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది.. చర్చకు సిద్ధమా? రేవంత్

Next Story