Achampeta: ఆన్‌లైన్ యాప్ పేరిట భారీ ఘరానా మోసం

by Ramesh Goud |
Achampeta: ఆన్‌లైన్ యాప్ పేరిట భారీ ఘరానా మోసం
X

దిశ, అచ్చంపేట : ప్రతీ రోజూ ఎక్కడో ఒకచోట ఆన్లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందొచ్చని ఆలోచన ఉన్న ప్రజలను ఆసరాగా చేసుకొని ఆన్లైన్ యాప్ లతో మోసగిస్తూ అతి సునయసంగా బోర్డులను తిప్పేస్తూ ప్రజలను మోసగిస్తున్న తరుణం కోకోల్లలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల తర్వాత ఆ యాప్ కనిపించదు, యాప్‌ను పరిచయం చేసిన వ్యక్తులు కనుమరుగు అవుతున్న సంఘటనలు అనేకం. అలాంటి ఘటనే నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో చోటు చేసుకుంది. డెకత్లాన్ ఆన్లైన్ యాప్ పేరుతో భారీ ఘరానా మోసం ఒకటి కలకలం రేపుతుంది. ఈ యాప్ ద్వారా లక్ష పెట్టుబడి పెడితే ఆ లక్షకు మూడు నుంచి ఐదువేల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుందని, రోజుకు రూ. 5 వేల చొప్పున తీసుకోవచ్చని నమ్మించడంతో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన అనేకమంది సుమారు కోటికి పైగా డిపాజిట్ పెట్టినట్టు తెలుస్తుంది. వారిలో పెట్టుబడి పెట్టిన కొందరికి కొద్ది రోజులపాటు చెప్పినట్టుగానే డబ్బులు చెల్లిస్తూ నమ్మకాన్ని కలిగించారు. ఈ ఘరానా మోసంలో వ్యాపారస్తులు, సామాన్యులు, ఉపాధ్యాయులు, పోలీస్ శాఖలో పనిచేసిన వారు కూడా కొందరు మోసపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మోసపోయిన అమాయక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సాహసం చేయటం లేదు. ఏది ఏమైనాప్పటికీ ఆన్లైన్ మోసాల ద్వారా ప్రజలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని ఆశతో మోసపోతూనే ఉన్నారు.

గత రాత్రి నుంచి పని చేయని యాప్..

గత రెండు మూడు రోజుల క్రితం ఆన్లైన్ యాప్ పనిచేయకపోవడంతో.. ఆ యాప్ ను పరిచయం చేసిన వ్యక్తులను డిపాజిట్ చేసిన వారు నిలదీయడంతో కొంత సాంకేతిక లోపం తలెత్తిందని, దాని స్థానంలో నూతన యాప్ వస్తుందని, అందుకు ప్రతి ఒక్కరూ వెయ్యి రూపాయలు చెల్లించాలని సూచించడంతో ఆ విధంగా డబ్బులు కూడా చెల్లించినట్లు సమాచారం. నూతన డెకత్‌లాన్ యాప్ ద్వారా ఘరానా కేటుగాళ్లు డిపాజిట్లను లాగేసుకున్నారు. ఇక గురువారం సాయంత్రం నుండి యాపు పని చేయకపోవడంతో పెట్టుబడి పెట్టిన ప్రజలు విస్తుపోయి, మోసపోయామని లోలోపల సనుక్కుంటూ అయోమయంలో పడ్డారు. అధిక లాభం కోసం కొందరు బంగారం తాకట్టుపెట్టి అందులో డిపాజిట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనాప్పటికీ మోసపోయిన ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సాహసం చేయకపోవడం కొసమెరుపు. ఇలా మోసపోయిన వారిలో అచ్చంపేట, పదరా, అమ్రాబాద్, బల్మూరు, ఉప్పునుంతల తదితర మండలాలకు చెందిన వారు సుమారు 500 మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story