సభ్యులడిన సమాచారం అందించాలి.. మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి

by Javid Pasha |
సభ్యులడిన సమాచారం అందించాలి.. మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగులో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని అధికారులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసుశాఖ అధికారులతో మంగళవారం శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలన్నారు.

సమావేశాలు పారదర్శకంగా జరిగి ప్రజలకు అన్ని విషయాలను తెలియజేయాల్సిన అవసరమున్నదన్నారు. మనమంతా ప్రజలకు జవాబుదారీ అని, గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలిలని సూచించారు.

మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాల్లో ప్రోటోకాల్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శాసన మండలి సమావేశాలు జరిగే సమయంలో అధికారులు విధిగా హాజరవ్వాలని, సమన్వయం తో రెండు సభలను సజావుగా నడిచేలా చూడాలన్నారు. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నతంగా,ఆదర్శంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. సభ్యులకు ముందస్తుగానే తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లలో తర్జుమా చేసిన సమాధానాలు ఇవ్వాలని అధికారులను కోరారు. శాఖల వారీగా సమాచారం నోడల్ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు. ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి సూచించారు. ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కొత్త ప్రోటోకాల్ బుక్ డ్రాఫ్ట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు.

సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, శాసనసభ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి చీఫ్ విప్ భానుప్రసాద రావు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద కుమార్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, డీజీపీ అంజనీ కుమార్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సీవీ అనంద్, రాచకొండ కమీషనర్ డీఎస్ చౌహన్, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవ రెడ్డి పాల్గొన్నారు.


Advertisement

Next Story