ఏసీ గదులు వదిలి ఫీల్ట్‌లోకి.. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న ఐఏఎస్‌లు

by Shiva |
ఏసీ గదులు వదిలి ఫీల్ట్‌లోకి.. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న ఐఏఎస్‌లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏసీ గదులు వదిలి ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనతో అధికారులు ఇప్పుడిప్పుడే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు, గురుకులాలను తనిఖీ చేస్తున్నారు. అక్కడున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ప్రజలు, విద్యార్థుల నుంచి ఫీడ్​బ్యాక్​తీసుకుంటున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న, విధులకు హాజరుకాని కింది స్థాయి ఆఫీసర్లపై క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటున్నారు.

సీఎం సూచనతో అలర్ట్

రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డాక చిన్న ప్రాంతాలుగా మారాయి. ఎటు వెళ్లినా గంటలో జిల్లా కేంద్రానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇంత వెసులుబాటు ఉన్నా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ఏసీ గదుల నుంచి బయటికి రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న జరిగిన మాజీ ఐఏఎస్​అధికారి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రస్తావించారు. సీఎం సూచన నేపథ్యంలో ఏఐఎస్‌లు ఒక్క సారిగా అలర్ట్​అయ్యారు. ఇప్పుడిప్పుడే ఏసీ గదులు వదిలి గురుకులాలు, ఆస్పత్రులు, స్కూళ్లను తనిఖీ చేస్తున్నారు. ప్రజలతో మాట్లాడుతూ వారి కష్ట సుఖాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్​ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్​హనుమంతరావు, మేడ్చల్​కలెక్టర్​గౌతమ్​పొట్రు, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ సహా కొద్ది మంది జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో హాస్పిటల్, స్కూల్, గురుకుల హాస్టల్స్, ప్రభుత్వ కార్యాలయం వంటి పరిశీలించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.

మారని కొందరి ఐఏఎస్‌ల తీరు..

ముఖ్యమంత్రి సూచించినా ఇంకా కొన్ని జిల్లాల కలెక్టర్లు ఏసీ గదులు విడటం లేదనే ఆరోపణలున్నాయి. అధికారులు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారనే సమాచారాన్ని ప్రభుత్వం, సీఎంవో వర్గాలు ఎప్పటికప్పుడూ తెప్పించుకుంటున్నారు. క్షేత్ర స్థాయి పర్యటనల ఆధారంగా మండలి ఎన్నికల కోడ్​ముగియగానే బదిలీలు ఉంటాయని నిర్ధారణకు వచ్చారు. వాస్తవంగా చిన్న జిల్లాలు అయ్యాక కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గింది. ప్రస్తుతమున్న కలెక్టర్లు​జూనియర్లుగా ఉండటం, స్మార్ట్​వర్క్​తరహాలో వ్యవహరిస్తుండటంతో, ప్రజలతో మమేకం కావడం ద్వారా వచ్చే అనుభవం, అనుభూతి గురించి తెలియకపోవడంపై వారు అంతగా దృష్టి పెట్టడంలేదని తెలిసింది. మరి కొందరు తమకు ఫైల్స్​చూసే పని ఎక్కువగా ఉన్నదని, సమీక్షా సమావేశాలు ఉంటున్నాయని, భూసేకరణ, ప్రజావాణి తదితర వాటి కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Next Story

Most Viewed