KTR: రాజలింగమూర్తి హత్య కేసులో సంచలనం.. తెరపైకి కేటీఆర్ పేరు!

by Prasad Jukanti |   ( Updated:2025-02-20 08:46:29.0  )
KTR: రాజలింగమూర్తి హత్య కేసులో సంచలనం.. తెరపైకి కేటీఆర్ పేరు!
X

దిశ, కాటారం/డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త, మాజీ కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్య కేసు (Rajalingamurthy murder case) రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ హత్య వెనుక కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. రాజలింగం మర్డర్‌కు భూ వివాదాలే మొదట ప్రధాన కారణంగా భావించినా.. రాజకీయ కక్ష కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐదుగురుపై వ్యక్తులపై రాజలింగం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్ కుమార్ తెలిపారు. ఇవాళ రాజలింగమూర్తి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

హత్యోదంతంపై సర్కార్ సీరియస్!

ఈ హత్యను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, తదితరులపై న్యాయపోరాటం చేస్తున్న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికావడంతో ఈ ఘటనపై తెలంగాణ సీఎం కార్యాలయం(సీఎంవో) ఆరా తీసింది. మర్డర్‌కు గల కారణాలపై నిఘా వర్గాల నుంచి సమాచారం కోరింది. దీంతో కీలక వివరాలను అధికారులు సేకరించారు. మేడిగడ్డ బ్యారేజీలో అవకతవకలు జరిగాయని రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేయగా ఈ కేసు వాదిస్తున్న లాయర్ 6 నెలల క్రితం ఆకస్మికంగా మృతిచెందగా నిన్న రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు. దీంతో ఈ హత్య కేసును సీబీసీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కేటీఆర్ అండతోనే మర్డర్ : రాజలింగమూర్తి భార్య సరళ

కాళేశ్వరం అవకతవకల వ్యవహారంలో రాజలింగమూర్తి కేసు గెలిస్తే తమ ఆటలు సాగవనే తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య సరళతో పాటు అతడి కూతురు, అన్న కొడుకు ఆరోపించారు. కేటీఆర్ (KTR) అండతోనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన అనుచరుడు హరిబాబు, సంజీవ్, రవి తదితరులు కలిసి ఈ హత్య చేశారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కేసులో రూ.10 లక్షలు తీసుకుని వెనక్కి తగ్గాలని గండ్ర వెంకటరమణారెడ్డి బెదిరిస్తున్నాడని రాజలింగమూర్తి తనతో చెప్పాడని సరళ వెల్లడించారు. అయితే తాను ఎవరి సొమ్ముతినలేదు.. అన్యాయంపై పోరాటం చేస్తున్నానని తన భర్త చెప్పాడని వివరించారు. హంతకులను పట్టుకునే వరకు అంత్యక్రియలు చేయబోమని చెప్పారు.

దోపిడీని ప్రశ్నిస్తే చంపేస్తారా?: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణను దోచుకొని తిని ఎదురుతిరిగిన వాళ్లను చంపేస్తారా? పాపం తగిలి పోతరు అంటూ మంత్రి కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) మండిపడ్డారు. కిరాయి హత్యలు చేయించడమే తప్ప కేసీఆర్‌తో ఏదీ కాదని అన్నారు. రాజలింగమూర్తి హత్యపై మంత్రి స్పందిస్తూ.. కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్‌కు శిక్ష పడుతుందనే కేటీఆర్ ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన భర్తను హత్య చేయించాడని రాజలింగమూర్తి భార్య, కూతురు ఆరోపిస్తుంటే మాజీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పోలీసులకు లొంగిపోమని చెప్పకుండా హరీశ్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి కృష్ణా వాటర్ అంటూ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు నువ్వు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా అంటూ ఫైర్ అయ్యారు. ఇవాళ గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజలింగమూర్తి హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, గండ్ర వెంకటరమణా రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. సీబీ సీఐడీ విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి వెంటనే శిక్ష వేయాలని మంత్రి అన్నారు. హత్యను సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్‌గా తీసుకుంటారని చెప్పారు.

హత్యతో నాకు సంబంధం లేదు : గండ్ర వెంకటరమణారెడ్డి

రాజలింగమూర్తి హత్యతో బీఆర్ఎస్ పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (Gandra venkataramana Reddy) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. హత్య నెపం బీఆర్ఎస్, కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు తనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ హత్యపై సీఐడీ, సీబీఐ విచారణ చేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు.



Also Read..

Komatireddy: హరీశ్ రావు మనిషివేనా?..రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు



Next Story

Most Viewed