ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ కేఎస్, శ్రీనివాసరాజు నియామకం

by Ramesh N |   ( Updated:2024-07-01 12:02:09.0  )
ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ కేఎస్, శ్రీనివాసరాజు నియామకం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాస‌రాజు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఫ్రాస్టక్షర్ అండ్ ప్రాజెక్టుల సలహాదారుగా కేఎస్ శ్రీనివాసరాజును నియమించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) జేఈవోగా సుదీర్ఘకాలంగా పనిచేసిన కేఎస్‌ శ్రీనివాసరాజు ఇటీవలే వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. 2001 ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసరాజు 2011లో విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో టీటీడీ జేఈవోగా నియమితులయ్యారు. ఆ తర్వాత జేఈవోగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్‌ వరకు ఎనిమిదేళ్లకు పైగా టీటీడీ జేఈవో బాధ్యతల్లో కొనసాగారు.

శ్రీనివాసరాజు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో జేఈవోగా విధులు నిర్వహించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంటర్‌ కేడర్‌పై తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. డిప్యూటేషన్‌పై తెలంగాణలో నాలుగేళ్లకుపైగా చేశారు. ఇక్కడ రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి గా విధులు నిర్వర్తించారు. అయితే డిప్యుటేషన్‌ ముగియడంతో నేరుగా ఏపీకి వచ్చి రిపోర్టు చేశారు. గత మే నెలలో ఏపీ సీఎస్‌కు రిపోర్టు చేశారు. కాగా, జూన్ 19న శ్రీనివాసరాజు వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. గత వారం ఆమోదం తెలుపుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియామకం అయ్యారు.

Advertisement

Next Story