ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమిర్ ఆలీ ఖాన్.. అధికారిక ఉత్తర్వులు జారీ

by GSrikanth |
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమిర్ ఆలీ ఖాన్.. అధికారిక ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖాళీగా ఉన్న రెండు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమిర్ ఆలీ ఖాన్ పేర్లను ఆమోదిస్తూ గవర్నర్ సంతకం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ దీనిని ధృవీకరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఉన్న డి.రాజేశ్వరరావు, ఫారూక్ హుస్సేన్ పదవీకాలం గతేడాది మే 27న పూర్తికావడంతో ఆ స్థానాల్లో వీరిద్దరినీ నియమించేలా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.

ఆరేండ్ల పాటు ప్రొఫెసర్ కోదండరాం, అమిర్ ఆలీ ఖాన్ ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ఈ నెల 27వ తేదీతో గెజిట్ విడుదల చేయాలని గవర్నర్ ఆదేశించారు. గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుని సంబంధిత ఫైల్‌ను గవర్నర్‌కు పంపినా వారికి ప్రభుత్వం పేర్కొన్న కేటగిరీ ప్రకారం తగిన అర్హతలు లేవంటూ తిరస్కరించారు. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం, అమిర్ ఆలీ ఖాన్ పేర్లను ఖరారు చేశారు.

Advertisement

Next Story