వరద బాధితులకు అండగా ఉంటాం

by Sridhar Babu |
వరద బాధితులకు అండగా ఉంటాం
X

దిశ,తిరుమలాయపాలెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరద బాధితులకు అండగా ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరద ముంపునకు గురైన రాకాసి తండా గ్రామాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి ఆయన పరిశీలించారు. తిరుమలాయపాలెం మండలంలోని అజ్మిరతండా పరిధి రాకాసి తండాలో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. వరదకు దెబ్బతిన్న ఇళ్లను పంట పొలాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాకాసితండా ప్రజలు వరద కారణంగా సర్వస్వం కోల్పోయారన్నారు. తండా ప్రజలు తమకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరారని, అందరి ఆమోదం ప్రకారం రాకాసితండాను సురక్షిత ప్రాంతానికి మార్చే ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.

వరద బాధితులు ధైర్యంగా ఉండాలని, వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటాయని కిషన్ రెడ్డి చెప్పారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు, అనేక జిల్లాలు జలమయమయ్యాయని అన్నారు. నష్టపోయిన వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం, మంత్రులను పంపించిందని ఆయన తెలిపారు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేసి పంపించాలని కిషన్ రెడ్డిని ఆదేశించారన్నారు. ఇక్కడ జరిగిన విపత్తుని దేశ విపత్తుగా తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం రాకాసి తండా వరద బాధితులకు గ్యాస్​ పొయ్యి, సిలిండర్ తోపాటు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. వారి వెంట బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్​, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, బీజేపీ కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చావా శివరామకృష్ణ, మాజీ ఎంపీపీ మంగీలాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షుడు ప్రసాద్, ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed