గ్రామ కంఠం భూమికి ఇంటి నెంబర్

by Sridhar Babu |
గ్రామ కంఠం భూమికి ఇంటి నెంబర్
X

దిశ, వైరా : అది గ్రామ కంఠం భూమి. ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయితే ఆ భూమిపై కన్నేసి రేకుల షెడ్డు నిర్మించిన వారికి మున్సిపాలిటీ అధికారులు దర్జాగా ఇంటి నెంబర్ ఇచ్చేశారు. గ్రామ కంఠం భూమిని కబ్జా చేసిన వారి పేరుతో ఇందిరమ్మ ఇళ్ల పట్టాను సృష్టించి ఆ పట్టా ఆధారంగా ఇంటి నెంబర్ కేటాయించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని పల్లిపాడు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమూహం సమీపంలో 301వ సర్వే నెంబరులో గ్రామకంఠ భూమి ఉంది. ఈ భూమిని ఆక్రమించుకొని ఆ గ్రామానికి చెందిన పలువురు రేకుల షెడ్డు వేసుకున్నారు. పల్లిపాడు గ్రామానికి చెందిన జంపాల నరసింహ కూడా ఈ భూమిలో రేకుల షెడ్డు వేసుకున్నాడు. అయితే ఈ రేకుల షెడ్డు కు ఇంటి నెంబర్ మంజూరి కోసం నకిలీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాను సృష్టించారు. నకిలీ ఇందిరమ్మ ఇళ్ల పట్టా ఆధారంగా ఆ ప్రాంతానికి

సంబంధంలేని 3-34/A/1/A/1 ఇంటి నెంబర్ ను నరసింహ భార్య జంపాల ఉపేంద్ర పేరుతో కేటాయించారు. 15 సంవత్సరాల నాటి ఇందిరమ్మ ఇంటి పట్టా ఆధారంగా ఇంటి నెంబర్ ఇవ్వాలంటే ముందుగా మున్సిపాలిటీ అధికారులు అప్పట్లో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని పరిశీలించాలి. ఇందిరమ్మ ఇల్లులకు విడతల వారీగా వచ్చిన బిల్లులను పరిశీలించాలి. అయితే గ్రామ కంఠ భూముల్లో ఎలాంటి ఇందిరమ్మ ఇల్లు లేకుండా రేకుల షెడ్డుకు నేరుగా ఇంటి నెంబర్ కేటాయించడం విశేషం. ఈ ఇంటి నెంబర్ పేరుతో ప్రాపర్టీ యాక్సిస్ డీటెయిల్ లో సెల్ నెంబర్ 9999999999 వేయడం విశేషం.

అయితే ఈ గ్రామ కంఠం భూమిలో సుమారు 70 మందికి పైగా రేకుల షెడ్లు వేసుకుని ఉంటున్నారు. అయితే మిగిలిన వారికి కూడా దొడ్డిదారిన ఇంటి నెంబర్లు ఇచ్చి ఉంటారనే విమర్శలు విన వస్తున్నాయి. కాసుల కోసం మున్సిపాలిటీ అధికారులు బరితెగించి గ్రామ కంఠం భూమికి ఇంటి నెంబర్ ఇచ్చారు. ఇప్పటికైనా ఈ వ్యవహారం పై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామ కంఠం భూమికి ఇంటి నెంబర్ కేటాయింపు పై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed