భద్రాద్రిలో ముక్కోణపు పోటీ..?

by Shiva |
భద్రాద్రిలో ముక్కోణపు పోటీ..?
X

దిశ, భద్రాచలం : భద్రాచలం నియోజకవర్గంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య ముక్కోణపు పోటీ రసవత్తరంగా మారనుంది. మొదట బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన కమ్యూనిస్టులకు అధికార పార్టీ నుంచి నిరాశే ఎదురైంది. తర్వాత కాంగ్రెస్‌తో సై అనడానికి సిద్ధం అయినా.. ఆ పార్టీ నుంచి ఇంత వరకు ఆహ్వానం లేదు. దీంతో సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేయడానికి సిద్ధం అయ్యాయి.

బీఆర్ఎస్‌తో జత కడితే భద్రాచలం సీటు తమదే అని భావించిన సీపీఎంకు నిరాశ మిగిల్చింది. కాంగ్రెస్‌తో దోస్తీ కుదిరితే కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేసి, భద్రాచలం స్థానాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ, కాంగ్రెస్ సైతం పొత్తులపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో కమ్యూనిస్టులు తమకు బలం ఉన్న స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధం అయ్యాయి. అందులో భాగంగానే భద్రాచలం అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థి కారం పుల్లయ్యను బరిలో నిలుపుతున్నారు. దీంతో భద్రాద్రిలో ముక్కోణపు పోటీ అనివార్యంగా మారింది.

బీఆర్ఎస్ పార్టీకి ప్లస్..

2018 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే పొదెం వీరయ్య మహా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ మహా కూటమిలో ఉండగా, సీపీఎం, టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికలలో మహాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వీరయ్య 47,746 ఓట్లతో విజయం సాధించగా, టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు 35,961ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఒంటరిగా సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ మీడియం బాబురావుకు 14,228ఓట్లు లభించాయి. గత ఎన్నికల్లో మహా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న సీపీఐ ఈ సారి ఎన్నికల్లో సీపీఎంతో కలిసి పోటీ చేయడం, తెలంగాణలో సైతం అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని టీ టీడీపీ అధ్యక్షుడు ప్రకటించడంతో ఈసారి కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయనున్నది.

సీపీఐ ఓటు బ్యాంకు సీపీఎంకు కలుస్తుంది. సీపీఐకి నియోజకవర్గంలో 15 వేల నుంచి 20 వేల ఓట్లు ఉండగా.. టీడీపీకి 10 వేలు పైగా ఓటు బ్యాంకు ఉంది. టీడీపీ కమ్యూనిస్టులు పోటీతో కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ గత ఎన్నికల్లో, ఇప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేస్తుండటంతో అధికార ఓటు బ్యాంకు చీలే అవకాశం లేదు. గతంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ బలపడిందనే చెప్పాలి. కమ్యూనిస్టులు బరిలో ఉంటే బీఆర్ఎస్ పార్టీని విజయానికి దగ్గర చేసినట్లేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed